ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గనుల తవ్వకాలకు అనుమతివ్వమని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మల్లయ్యకొండలో గనుల తవ్వకాలకు అనుమతిస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పుణ్యక్షేత్రం మల్లయ్య కొండ శ్రీబ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం జీర్ణోర్థరణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఆలయం నిర్మాణానికి 3.20 కోట్ల రూపాయలు, రహదారికి 6.50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
కొండపై ఉద్యాన వనం, అతిథి గృహాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. వచ్చే ఏడాది మహా శివరాత్రి నాటికి నిర్మాణాలు పూర్తి చేసి మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అభివృద్ధి పేరుతో ఖనిజాలు తవ్వుతున్నారనే దుష్ప్రచారంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులే ఆరోపణలకు సమాధానం చెబుతాయని మంత్రి అన్నారు.