Mining at kuppam: చిత్తూరు జిల్లా కుప్పం అటవీప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి అక్రమ మైనింగూ జరగడం లేదని.. గనులశాఖ సంచాలకులు వీ.జీ.వెంకట్ రెడ్డి తెలిపారు. జనవరిలోనే 4 బృందాలతో కుప్పం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించామని, అక్రమ మైనింగ్ కు బాధ్యులైన వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 15సార్లు గనుల శాఖ దాడులు చేసిందని, ఈ దాడుల్లో రూ.5 కోట్ల విలువైన 555 గ్రానైట్ బ్లాక్స్ తోపాటు.. 06 కంప్రెషర్లు, 02 హిటాచీ యంత్రాల సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖల సమన్వయంతో ఈ ప్రాంతంలో పూర్తి పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు.
కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు..
కుప్పం ప్రాంతంలో అక్రమ మైనింగ్ కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని వెంకట్ రెడ్డి తెలిపారు. ద్రవిడ యూనివర్సిటీ ప్రాంతంలో.. మైనింగ్ కోసం ఎవరూ చొరబడకుండా ట్రెంచ్ లు ఏర్పాటు చేశామన్నారు. యూనివర్శిటీ పరిధిలో సెక్యూరిటీ గార్డుల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్, రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైనింగ్ అక్రమాల నియంత్రణకు మూడంచెల విధానం అమలు చేస్తామని.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.