లాక్ డౌన్ కారణంగా....తినడానికి సరైన తిండి దొరక్క ఇబ్బంది పడుతున్నామంటూ.. చిత్తూరు జిల్లా శ్రీసిటీ వద్ద వలస కార్మికులు రోడ్డెక్కారు. శ్రీసిటీ సమీపంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడ వద్ద హీరో పరిశ్రమ నిర్మాణం కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం లేకపోవటంతో....లాక్ డౌన్ మినహాయింపుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించింది. దీంతో తమను సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబంగ, ఝార్ఖండ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన సుమారు 800 కార్మికులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న శ్రీసిటీ పోలీసులు...సంఘటనా స్థలానికి చేరుకుని వలస కార్మికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.