Michaung_Cyclone_Districts_in_Chitoor Michaung Cyclone Districts in Chittoor: మిగ్జాం తుపాను(Michaung Cyclone) ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జలాశయాలు పూర్తిస్ధాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. తీర ప్రాంతమైన సూళ్లూరుపేటలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వాకాడు మండలం సువర్ణముఖి జలాశయం పూర్తి నీటిమట్టానికి చేరడంతో ఆరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కాళంగి, సువర్ణముఖి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కేవీబీ పురం మండలంలో కాళంగి జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. సువర్ణముఖి ప్రవాహంతో శ్రీకాళహస్తి సమీపంలోని లోతట్టు ప్రాంతమైన లంకమిట్ట ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రేణిగుంట మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా ప్రవహిస్తుండటంతో మల్లెమడుగు జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. గూడూరు వద్ద ఉద్ధృతంగా పంబలేరు వాగు ప్రవహిస్తోంది.
రాష్ట్రంపై మిగ్జాం తుపాను ఎఫెక్ట్ - దంచికొడుతున్న వర్షాలు
Latest Updates on Michaung Cyclone Sri kalahasti: జిల్లావ్యాప్తంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. తుపాను ప్రభావంతో వర్షాలతో పాటు భారీగా వీస్తున్న గాలులతో పలు ప్రాంతాలలో చెట్లు విరిగిపడుతున్నాయి. సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జలాశయాలు పూర్తిస్ధాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. శ్రీకాళహస్తి-పంగూరు రహదారిపై ఈదులు కాలం వద్ద వరద నీరు ప్రవహించడంతో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు కాజ్‌వేపై నిలిచింది. బస్సును గుర్తించిన స్థానికులు ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. శ్రీకాళహస్తి-పల్లం, శ్రీకాళహస్తి-పిచ్చాటూరు రహదారిపై వాగులు పొంగుతుండటంతో అధికారులు వాహన చోదకులను అప్రమత్తం చేసి రాకపోకలను మళ్లించారు.
దూసుకొస్తున్న మిగ్జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు
అదేవిధంగా సువర్ణముఖి నది కాజ్‌వేలపై వరద నీరు ప్రవహిస్తుండడంతో ఏర్పేడు మండలంలోని కొత్త వీరాపురం, మోదుగులపాలెం, పాపానాయుడుపేట-శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై, పాపానాయుడు పేట-గుడిమల్లం రహదారిపై రాకపోకలు నిలిచాయి. ఏర్పేడు మండలంలోని సిందేపల్లిలో ఓ పూరిగుడిసి గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. భారీ వర్షాల కురుస్తుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తిలో ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఏర్పేడు మండలంలోని గోపాలపురానికి చెందిన చెంగా రెడ్డి రెండు ఎకరాల బొప్పాయి తోట పూర్తిస్థాయిలో నేలకొరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా వరి నాట్లు నీట మునిగి ఇసుక మేటలు ఏర్పడ్డాయి. శ్రీకాళహస్తి మండలంలోని కాపు గున్నేరుకు వెళ్లే దారిలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో వరద నీరు ఉప్పొంగడంతో గ్రామీణ అవస్థలు పడుతున్నారు.
Control Room Numbers in Chittor:ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తిరుపతి కలెక్టరేట్, 4 రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్‌రూమ్ 0877-2236007, తిరుపతి డివిజన్ 9491077012, శ్రీకాళహస్తి డివిజన్ 9704161120, 9490739223; గూడూరు 08624 252807 ఎలాంటి సమస్యలు తలెత్తినా ఫిర్యాదుల స్వీకరణ నిమిత్తం ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. తుపానుపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం లేకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
వర్షం వల్ల తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు అనుమతిని నిలిపివేశారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు అనుమతి నిరాకరించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో తితిదే నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
బాధితుల పట్ల మానవతా దృక్పథంతో మెలగాలి - అధికారులతో సీఎం జగన్