'సప్త' స్వరాల సంగమం... ఆమె గానం పండితుల నుంచి పామరుల వరకు అందరిని అలరించే స్వరాలను అవలీలగా పలికించగల గాత్రం...ఆమె సొంతం. ఈ సప్త స్వరాలను సప్త భాషల్లో పలికిస్తూ అరుదైన గాయనిగా మన్ననలందుకుంటోంది తిరుపతికి చెందిన యజ్ఞప్రియ. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ లాంటి భారతీయ భాషలతో పాటు అరబిక్లోనూ అనర్గళంగా ఆలపిస్తూ ఆకట్టుకుంటోంది.
ఒంటరితనం భరించలేక
కడప జిల్లాకు చెందిన యజ్ఞప్రియ తల్లిదండ్రులిద్దరూ కువైట్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. బాల్యమంతా అక్కడే గడిచింది. అమ్మానాన్న ఉద్యోగానికి వెళ్లటంతో యజ్ఞప్రియ ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. స్వేచ్ఛగా బయట వెళ్లాంటే కువైట్‌లో అనేక ఆంక్షలు. చట్టాలు చాలా కఠినంగా ఉండేవి. ఈ సమయంలో తన భావాల్ని వ్యక్తం చేసేందుకు సంగీతంపై దృష్టి సారించింది. మాతృభాష తెలుగుతో పాటు అరబిక్, హిందీ, ఇంగ్లీషు గీతాలు పాడటం మొదలు పెట్టింది. తమిళం, మళయాళం, కన్నడ వంటి దక్షిణ భారతీయ భాషలపైనా పట్టుసాధించింది.
ఎన్నో రంగాల్లో ప్రతిభ
తొమ్మిదో తరగతి వరకు కువైట్ చదివిన యజ్ఞప్రియ.. ఆ తర్వాత భారత్‌కు వచ్చింది. బెంగుళూరులో ఇంటర్ పూర్తి చేసిన ఆమె.. తిరుపతిలోని తాతయ్య వాళ్ల దగ్గర ఉంటూ శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తోంది. మరోవైపు ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో బీబీఏ సైతం చదువుతోంది. ఏకకాలంలో రెండు డిగ్రీలు చేయటమే కాక వివిధ భాషల్లో పాడుతూ... శ్రోతలకు సంగీతంలోని మాధ్యురాన్ని పరిచయం చేస్తోంది. తన పాటల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ సంగీతాభిమానులకు చేరువైంది. ఇదే సమయంలో లఘు చిత్రాలకు పాటలు పాడే అవకాశాలు అందుకుంది. మరో వైపు డబ్బింగ్ కళాకారిణిగానూ ప్రతిభ చూపుతోంది.
సమాజ సేవలోనూ...
హార్ట్ ఫుల్లీ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థలోనూ యజ్ఞప్రియ కీలకపాత్ర పోషిస్తోంది. సమాజ సేవలోనూ ముందుంటుంది. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, విద్యార్థిగా, సమాజ సేవకురాలిగా రాణించటానికి కారణమైన తన తల్లి మీద ఓ వీడియో ఆల్బమ్ రూపొందించింది యజ్ఞప్రియ. మాతృ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఆ పాట.. సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఏడు భాషల్లో తనకున్న పట్టు, చక్కని ప్రతిభతో ఇప్పటివరకూ యజ్ఞప్రియ అనేక పురస్కారాలు అందుకుంది. శాస్త్రీయ సంగీతంలో మరింత నైపుణ్యం సాధించటంపై ప్రస్తుతం దృష్టి సారించిన యజ్ఞప్రియ... భవిష్యత్తులో న్యాయవాదిగా పేదలకు సేవ చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఇదీ చదవండి
సమరావతి@ ఆ 29 గ్రామాల్లో 'అ' అంటే.. అమరావతే