Glowill foundation: ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది కార్పొరేట్ ఉద్యోగాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగం ఉంటే చాలు భవిష్యత్‌కు ఒక భరోసా ఉన్నట్టే అనుకునే వారే ఎక్కువ. మరి అందరూ పట్టణాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేస్తే వ్యవసాయం చేసేది ఎవరు..? మనకు ఆహారం అందించేది ఎవరు..? ఇదే ఆలోచన ఆ యువకుడి మదిని తొలచింది. దీంతో.. ఎలాగైనా వ్యవసాయంలోకి యువతను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రత్యేక దారిలో పయనిస్తున్నాడు వెంకటేష్ వర్మ.
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం తిరుమణ్యం రాజులకండ్రిగ చెందిన వెంకటేష్‌వర్మ ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం బెంగుళూరులోని ఒక సంస్థలో ఐదేళ్ల పాటు పనిచేశాడు. తరువాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్‌షిప్‌లో ఓ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత దిల్లీలోని ఒక పరిశోధన సంస్థలో చేరాడు. అక్కడ తను చేసిన పరిశోధనలు.. మరో కోణంలో ఆలోచించేలా చేశాయి. వ్యవసాయం వైపు కదిలించాయి. దీంతో ఉద్యోగం వదిలి పల్లె బాట పట్టాడు. వ్యవసాయంలోకి యువతను తీసుకరావాలనే లక్ష్యంతో.. "గ్లోవిల్ ఫౌండేషన్" సంస్థ ప్రారంభించాడు.