కరోనా మహమ్మారిని నివారించాలంటే లాక్ డౌన్‌ను కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. కానీ నిర్దేశిత సమయాల్లో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరకులను కొనుగోలు చేసుకోవచ్చంటూ ...ప్రభుత్వాలు ఇస్తున్న సమయాన్ని చాలా మంది ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు. సరకుల కొనుగోలుకు సమయం మించిపోయిన రహదారులపైన తిరుగుతూ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలను నియంత్రించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది తిరుపతి నగరపాలక సంస్థ. ఒక్క ఫోన్ కాల్ లేదా వాట్సప్ కాల్ ద్వారా ప్రజలు కోరుకున్న సరకులను నేరుగా ఇంటికే హోమ్ డెలివరీ చేయిస్తోంది.
రోజుకు 2వేలకు పైగా హోమ్ డెలివరీలు...
నగర వ్యాప్తంగా 12 సూపర్ మార్కెట్లకు ఈ రకమైన అనుమతులు ఇచ్చినట్లు నగరపాలక కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. రోజుకు 2వేలకు పైగా హోమ్ డెలివరీలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఫోన్ కాల్ లేదా వాట్సప్ ద్వారా సమాచారమందిస్తే సూపర్ మార్కెట్ల నిర్వాహకులు...అత్యంత జాగ్రత్తగా ఆ సరుకులను ప్యాక్ చేసి అందిస్తారు. అక్కడ పనిచేసేవాళ్లు సైతం విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించి...సరుకులను ప్యాకింగ్ చేస్తున్నారు. నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని సూపర్ మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు.