మనస్తాపంతో ప్రేమికులు వేర్వేరుగా ఆత్మహత్యకు(LOVERS SUICIDE) యత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. వీరిలో యువకుడు మృతి చెందగా.. యువతి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
చిత్తూరు జిల్లా కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీ బాకివానివడ్డిపల్లెకు చెందిన సద్గురు(21) తన అన్న మరదలు (17) ప్రేమించుకున్నారు. ఇరువురు వివాహం చేసుకోవాలని కుటుంబ పెద్దలను అడిగారు. ఒక కూతుర్ని ఆ కుటుంబానికి ఇవ్వటంతో.. మరో బిడ్డను ఇవ్వడానికి అమ్మాయి తరఫు తల్లిదండ్రులు అంగీకరించలేదు. చదువు పూర్తి అయ్యేవరకు ప్రస్తావన తేవద్దనే షరతు పెట్టారు. మనస్తాపంతో ప్రేమికులు వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం విషం తీసుకున్నారు. సద్గురు ఎర్రగొండక్కవారిపల్లెలోని తన మేనత్త గుర్రమ్మ ఇంటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. పురుగుల మందు తాగి సరిగ్గా ప్రాణాపాయ స్థితిలో మేనత్త ఇంటికి చేరుకున్నాడు. కంగారు పడ్డ కుటుంబసభ్యులు.. యువకుడిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఇదే సమయంలో యువతి కూడా ఇంట్లో పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి సమీప ఆస్పత్రికి తరలించారు. కడకడ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.