కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుగిరుల్లోని అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించేందుకు తితిదే సిద్ధమైంది. ఇందుకోసం పెద్ద కసరత్తే చేసింది. గతేడాది డిసెంబర్‌లో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతులు, ఎస్వీ వేద ఆధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ సహా పలువురితో కమిటీ వేసింది. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్య గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి చెంత గల అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని కమిటీ నిర్థరించింది.
ఆకాశగంగ తీర్థంలో తపస్సు...
త్రేతాయుగంలో తిరుమల సప్తగిరుల్లో అంజనాద్రిని ప్రస్తావించారని, భావిశోత్తర పురాణం మొదటి అద్యాయం 79వ శ్లోకంలో హనుమ జన్మస్థలం, జన్మరహస్యం గురించి వివరాలున్నట్లు పండితులు చెప్తున్నారు. అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చినందునే వెంకటాద్రికి అంజనాద్రి అని పేరొచ్చిందన్నది వారి వాదన. మాతంగి మహర్షి సూచన మేరకు నారాయణ పర్వత ప్రాంతంలోని ఆకాశగంగ తీర్థంలో అంజనాదేవి 12 ఏళ్ల పాటు తపస్సు చేశారని ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ఇచ్చిన ఫలాన్ని తిన్న అంజనాదేవి ఆకాశగంగ తీర్థం సమీపంలో హనుమంతునికి జన్మనిచ్చినట్లు ద్వాదశ పురాణంలో ఉందంటున్నారు.