ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీనివాసుడితోపాటు స్వయంభువుగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయుకుడు, రాహుకేతు పూజలకు పేరెన్నికగన్న శ్రీకాళహస్తీశ్వరుడు కొలువైన చిత్తూరు జిల్లాలో.. పుణ్యక్షేత్రాలన్నీ లాక్‌డౌన్‌కు ముందు భక్తులతో కిటకిటలాడేవి. కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆలయాలన్నీ భక్తులు లేక వెలవెలబోతున్నాయి.
తిరుమల సప్తగిరుల్లో 50 రోజులుగా నిశ్శబ్దం ఆవరించింది. వసతి గదుల సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు, ఆర్జిత సేవలు నిలిపేయగా.. ఖజానాకు ఆదాయం రావడంలేదు. శ్రీవారి ఆలయ ప్రవేశాన్ని భక్తులకు నిషేధించిన కారణంగా దాదాపు 200 కోట్ల రూపాయలపైబడి ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రోజుకు సగటున హుండీ రూపంలోనూ... తలనీలాలు సహా మిగిలిన మార్గాల్లోనూ వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోయింది.
తిరుమల తర్వాత అధిక సంఖ్యలో భక్తులు వచ్చే శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకూ ఆదాయం ఆగిపోయింది. రాహుకేతు పూజలకు దేశం నలుమూలల నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు చేరుకొంటారు. హుండీ, రాహుకేతుల పూజల కోసం భక్తులు చెల్లించే సొమ్ము ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది.
వాయులింగేశ్వర ఆలయానికి హుండీ ద్వారా కోటీ పదిహేను లక్షలు, రాహుకేత పూజలు ద్వారా ఆరున్నర నుంచి ఏడు కోట్లు, ప్రసాదాల విక్రయాలు ద్వారా కోటి, వసతి గృహాల ద్వారా కోటి రూపాయల చొప్పున నెలకు పదికోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరేది. రెండు నెలలుగా భక్తుల రాకపోకలు లేకపోవటంతో... దాదాపు 20 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఆదాయం కొరవడిన కారణంగా... దేవస్థానం అధికారులు పొదుపు చర్యలు చేపట్టారు.