ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సొంత నియోజకవర్గం నగరిలో పరిశ్రమల ఏర్పాటు కోసం ఏపీఐఐసీ సేకరిస్తున్న భూములకు పరిహారం చెల్లించే అంశంలో పలు అక్రమాలు జరుగుతున్నాయని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల పరిధిలోని వడమాలపేట, పాదిరేడు ఆది ఆంధ్రవాడ, వడమాళ, గొల్లపల్లె, పాదిరేడు హరిజనవాడలో ఉన్న 360 ఎకరాల భూములను సేకరించడానికి ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.
నిరుపేదల భూమి
ఆయా గ్రామాల్లో భూమి లేని ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు 1982లో అప్పటి ప్రభుత్వం వడమాలపేట 97, 108, 111, 114,117, 119, 121 సర్వే నెంబర్లలో సాగుకు అనువైన భూములు ఇచ్చింది. ఒక్కో లబ్ధిదారునికి ఒక్కోప్రాంతంలో కొంత భూమి చొప్పున పలు సర్వేనెంబర్లలో రెండున్నర ఎకరాల వరకు పంపిణీ చేశారు. గత 40 సంవత్సరాలుగా వారు ఆ భూములను సాగుచేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
తెరపైకి నేతలు
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆ భూములను సేకరించాలని నిర్ణయం తీసుకుని ఎకరాకు రూ. 17.50 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు సాగు భూములు ప్రభుత్వానికి అప్పగించడానికి అంగీకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్యలు ఇక్కడే ప్రారంభమైనట్లు నిర్వాసితులు చెప్తున్నారు.
భూసేకరణ...లక్షల రూపాయల పరిహారం అంశాలు తెరపైకి రావడంతో స్థానిక నేతలు కొందరు రంగంలోకి దిగారని... తమకు కమీషన్ ఇస్తే తప్ప పూర్తిస్థాయిలో పరిహారం రాదంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు వాపోతున్నారు..