ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు డివిజన్​లో ఎన్నికల పోరు.. ఏకగ్రీవాలు 112 - చిత్తూరు జిల్లా న్యూస్ అప్​డేట్స్

చిత్తూరు డివిజన్‌లో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యే నాటికి 112 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అధికార వైకాపా మద్దతుదారులు 95 మంది, తెదేపా మద్దతుదారులు తొమ్మిది మంది, స్వతంత్రులు ఎనిమిది మంది ఉన్నారు.

local body elections
local body elections

By

Published : Feb 5, 2021, 10:44 AM IST

చిత్తూరు డివిజన్​లో తొలి దఫాలో 468 పంచాయతీలకుగాను 453 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 341 స్థానాలకు ఈనెల 9న పోలింగ్‌ జరగనుంది. పూతలపట్టు నియోజకవర్గంలో 152 సర్పంచులకు ఏకంగా 49 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వైకాపా 40, తెదేపా ఏడు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 137 సర్పంచి స్థానాలకుగాను 26 చోట్ల పోటీ లేకుండా పోయింది. 2499 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

ఒక్కొక్కరుగా తప్పుకొంటూ..

నామినేషన్ల దాఖలు నాటి నుంచే గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం చర్చలు జరిగాయి. మూడు రోజుల్లో కలిపి చిత్తూరు డివిజన్‌లోని 20 మండలాలకుగాను సర్పంచి పదవికి 2,890, వార్డుసభ్యుల స్థానానికి 6,821 మంది నామపత్రాలు దాఖలు చేశారు. గ్రామాల్లో నాయకులతో మంతనాలు జరిపిన అనంతరం ఒక్కొక్కరుగా పోటీ నుంచి తప్పుకోవడం ప్రారంభించారు. గురువారం ఉదయం కొందరు నామపత్రాల ఉపసంహరణ దరఖాస్తులు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి వీరు వాటిని ఆర్వోలకు ఇవ్వడం ప్రారంభించారు.

మూడు గంటల వరకు అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయాలకు వస్తూనే ఉన్నారు. అప్పటివరకు వచ్చిన వారిని కార్యాలయంలోకి అనుమతించి.. సాయంత్రం వరకు పత్రాలను తీసుకున్నారు. నామపత్రాలు దాఖలు చేసిన వ్యక్తులు, వారి వెంట వచ్చిన వ్యక్తులతో గురువారం ఉదయం నుంచే కేంద్రాల వద్ద సందడి నెలకొంది. చర్చల అనంతరం ఇక్కడకు వచ్చిన అభ్యర్థులు.. చివరి నిమిషం వరకు కూడా తాము ఉపసంహరణ పత్రం పూరించమని చెప్పిన పరిస్థితి కనిపించింది.

ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో రెండుచోట్ల పోటీ

తొలి విడత ఎన్నికలు జరగనున్న చిత్తూరు డివిజన్‌లోని అధికార వైకాపా పార్టీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ స్వగ్రామాల్లో సర్పంచి స్థానాల్ని ఏకగ్రీవం చేసుకున్నారు. మరో ఇద్దరి ప్రయత్నాలు ఫలించలేదు. చిత్తూరు శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు స్వగ్రామం యాదమరి మండలం జంగాలపల్లి. నామినేషన్ల ఉపసంహరణ రోజు ఉన్న ఒక్క అభ్యర్థి పోటీ నుంచి తప్పించడంలో వైకాపా మద్దతుదారు రమేష్‌బాబు ఎన్నిక ఏకగ్రీవమైంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సొంత ఊరు నారాయణవనం మండలం భీమునిచెరువు.

ఇక్కడ నామపత్రాల దాఖలు నాడు ఒకరు డమ్మీగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపసంహరణ రోజు ఆ అభ్యర్థి వైదొలగడంతో వైకాపా సానుభూతిపరుడు మురుగేషన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వగ్రామం పాదిరికుప్పంలో పోటీ లేకుండా చేసుకోవాలని భావించినా.. ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. వైకాపా మద్దతుదారు ఒకరు, తెదేపా ఒకరు, జనసేన నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుది చిత్తూరు గ్రామీణ మండలం పాలూరు పంచాయతీ పిళ్లారిమిట్ట. ఈ స్థానంలో వైకాపా మద్దతుదారు పాపమ్మ, తెదేపా సానుభూతిపరురాలు గీత పోటీలో ఉన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా చిన్నగొట్టిగల్లు మండలానికి చెందినవారు. ఇక్కడ తొలి విడతలో ఎన్నికలు జరగడంలేదు.

ఇదీ చదవండి:

ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ల‌ రిజర్వేషన్‌కు.. అందుబాటులోకి కొత్త వెబ్‌సైట్‌!

ABOUT THE AUTHOR

...view details