తమిళనాడు, కర్ణాటక... రెండు పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న చిత్తూరు జిల్లాలో ప్రజలను అక్రమార్కులు వ్యసనాల కూపంలోకి లాగేస్తున్నారు. మద్యంపై ప్రజల్లో ఆసక్తి తగ్గించాలనే ఉదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచితే దాన్ని ఆసరాగా తీసుకుని అక్రమ మార్గాల్లో మద్యాన్ని యథేచ్ఛగా తరలిస్తూ.. అమాయకుల ప్రాణాలతో మత్తు మాఫియా ఆటలాడుకుంటోంది. ఇటీవలి కాలంలో తరచుగా నమోదవుతున్న కేసులు...శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ప్రత్యేకించి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో సాగుతున్న అక్రమ మద్యం రవాణా, నాటు సారా తయారీ ప్రజల ప్రాణాలు పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
- లెక్కల్లో మద్యం
లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న మే నెల నుంచి జిల్లాలో పరిస్థితులు ఒకసారి గమనిస్తే... 1,089 నాటు సారా తయారీ కేసులు నమోదుకాగా... ఇప్పటివరకు 1280 మందిని అరెస్ట్ చేశారు. 3 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. లాక్ డౌన్ ఆంక్షలను సొమ్ము చేసుకునేలా అక్రమ మద్యం రవాణా పొరుగు రాష్ట్రాలకు, సరిహద్దు గ్రామాలకు జోరందుకుంది. మే నుంచి ఇప్పటివరకు 1063 అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు కాగా, 1641 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 791 వాహనాలను సీజ్ చేసి...17,118 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 201 బెల్ట్ షాపులపైన కేసులు నమోదు చేసి 277 మందిని అరెస్ట్ చేశారు. ఇక జిల్లాలో పలు మార్గాల్లో గంజాయి రవాణా కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 287 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 10 కేసుల్లో 30 మందిని అరెస్టు చేశారు. వీరిలో మహిళలు కూడా ఉండటం ఆలోచించదగ్గ విషయం..
- ప్రజల్లో అవగాహన వచ్చేలా..
ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి తిరుపతి అర్బన్ పోలీస్, చిత్తూరు జిల్లా పోలీసులతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మత్తును చిత్తు చేయాలంటూ ప్రజల నుంచే అవగాహన మొదలయ్యేలా కార్యక్రమాలను రూపొందించింది. ప్లకార్డులు, బ్యానర్లు, హోర్డింగులు పెడుతూ... అక్రమ మద్యం రవాణా, శానిటైజర్ల సేవనం, సారా తయారీ వంటివాటిపై పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా.. ఫోన్ నెంబర్లు ప్రజలకు తెలిసేలా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం ద్వారా జిల్లాలో మత్తు మాఫియా ఆటలు కట్టిస్తామని అధికారులు చెబుతున్నారు.