ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కరోనాను ఎవరూ సీరియస్గా తీసుకోలేదని.. దానివలనే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళన చేపట్టారు.
రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనా బాధితులకు అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాను చేర్చామంటున్నారని.. అలా అయితే ఏ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంత బాగానే జరుగుతుంటే విజయసాయిరెడ్డి హైదరాబాద్లో ఎందుకు వైద్యం చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో కాలింగ్ ద్వారా అత్యవసరంగా ఆల్ పార్టీ సమావేశం పెట్టాలని కోరారు. వైరస్ విజృంభణతో ప్రజలు భయపడుతున్నారని.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.
కర్నూలులో..
కరోనా సోకిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన తెలిపారు. జిల్లాలో కరోనా విజృంభిస్తున్నా.. సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కొవిడ్ ఆసుపత్రులను పెంచాలని... ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి కరోనా భాదితులకు చికిత్స అందిచాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో..
కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యంపై చిత్తూరు జిల్లా నగరిలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిరంతరం కొవిడ్ సేవలో ఉంటున్న ఆశావర్కర్లు, వాలంటీర్లకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.