ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lance Naik Sai Teja: శోకసంద్రంలో సాయితేజ కుటుంబం.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు - సాయితేజ న్యూస్

Lance Naik Sai Teja: చురుకుదనానికి, ఆత్మవిశ్వాసానికి నిండైన ప్రతీక అతడు. దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో..అహోరాత్రులు శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి..త్రిదళపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు. రావత్ భద్రతా బృందంలో చోటు సంపాదించారు. అతడే లాన్స్ నాయక్ సాయితేజ. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తోపాటు ప్రాణాలు కోల్పోయిన ఈ తెలుగుతేజం.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు.

రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు
రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు

By

Published : Dec 9, 2021, 8:47 PM IST

Lance Naik Sai Teja: లాన్స్ నాయక్ సాయితేజ అకాల మరణం..అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన సాయితేజ... ఆకస్మికంగా తనువు చాలించడం.. అందర్నీ కలచివేసింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ చిన్నతనం నుంచి ఎంతోచురుగ్గా ఉంటూ.. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అనుకోని ప్రమాదంలో సాయితేజ ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్ర విషాదంలోకి నెట్టందని కుటుంసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

2012లో ఆర్మీ సిపాయిగా చేరిన సాయితేజ...కొంతకాలం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తించారు. ఏడాది తర్వాత పారాకమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ఎంపిక నుంచి శిక్షణ వరకు అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొని పారాకమాండో అయ్యారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టికరిపించే ట్రూపర్‌గా...నైపుణ్యం సాధించారు. కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చేస్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే సాయితేజలోని సామర్థ్యాన్ని గుర్తించిన రావత్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు.

సాయితేజకు ఐదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కుమార్తె దర్శిని ఉన్నారు. రావత్ కు వ్యక్తిగత సిబ్బందిగా చేరాక సాయితేజ దిల్లీలోనే ఉంటున్నారు. ఏడాది క్రితం తన కుటుంబాన్ని మదనపల్లెకి మార్చారు. ఈ ఏడాది వినాయక చవితికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని గంటల ముందు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం కొద్దిసేపటికే సాయి మరణవార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

సాయితేజ మృతి అతని స్వగ్రామంలో తీరని విషాదాన్ని నింపింది. యువకెరటం మృతి ఎంతో బాధాకరమని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయితేజకు స్వగ్రామంలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం కొత్తరేగడికి వచ్చిన సైనికాధికారులు.. సాయితేజ తల్లిదండ్రులు, పిల్లల రక్త నమూనాలు సేకరించారు.

ఇదీ చదవండి

Bipin Rawat: 'అగ్గిపెట్టె' సమాధానంతో ఆర్మీలో చేరిన రావత్​..!

ABOUT THE AUTHOR

...view details