Lance Naik Sai Teja Death: భరతమాతకు సేవ చేయాలని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి.. 29 ఏళ్లకే అమరుడైన లాన్స్‌నాయక్ సాయితేజ మృతదేహం నేడు స్వగ్రామానికి చేరుకోనుంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా సాయితేజ్ గుర్తింపునకు సైనికాధికారుల చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తల్లిత్రండులతోపాటు కుమారుడి రక్తనమూనాలను ఆర్మీ వైద్యులు సేకరించారు. పరీక్షలు పూర్తికాగానే భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి తరలించనున్నారు.
సైన్యంలో పనిచేస్తున్న సాయితేజ తమ్ముడు మహేష్‌బాబు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సిక్కిం నుంచి భార్యతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నారు. తండ్రి మోహన్‌ను చూడగానే.. ఒక్కసారిగా పట్టుకొని భోరుమన్నాడు. దాంతో తండ్రీ విలపించారు. సాయంత్రం 6 గంటలకు బెంగళూరు నుంచి ఇద్దరు ఆర్మీ వైద్యులు వచ్చారు. మృతదేహం గుర్తుపట్టేలా లేదని చెప్పి, డీఎన్‌ఏ పరీక్షల కోసం సాయితేజ తండ్రి మోహన్, తల్లి భువనేశ్వరి, భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞల రక్తనమూనాలను సేకరించారు. డీఎన్‌ఏ ఆధారంగా గుర్తించాక.. శుక్రవారం సాయంత్రానికి సాయితేజ మృతదేహం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉందని బంధువులు పేర్కొన్నారు.