ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 14 మంది మృతి

డ్రైవర్‌ అతి వేగం.. మలుపు.. ఆపై నిద్రమత్తు.. నిర్లక్ష్యం వెరసి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని మదార్‌పురం వద్ద జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-44)పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబంలోని 12 మంది, వాహనం డ్రైవరు, మెకానిక్‌లతో కలిపి 14 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది మహిళలు, అయిదుగురు పురుషులతోపాటు ఏడాది చిన్నారి ఉన్నారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Feb 14, 2021, 4:52 PM IST

Updated : Feb 15, 2021, 6:25 AM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె బాలాజీనగర్‌కు చెందిన నౌజీరా బీ కుటుంబం రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ దర్గాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు 16 మంది కుటుంబసభ్యులు టెంపో ట్రావెలర్‌ వాహనంలో యాత్రకు బయలుదేరారు. వారు అనంతపురం, కర్నూలు మీదుగా హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంది. తెల్లవారుజామున వెల్దుర్తి మదార్‌పురంలోని ఉపరితల వంతెన వద్దకు రాగానే ఒక్కసారిగా వాహనం కుడివైపు డివైడర్‌ ఎక్కి.. 40 అడుగుల దూరం మేర పల్టీలు కొడుతూ అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో వరంగల్‌ నుంచి తాడిపత్రి వైపు ఇనుప ఖనిజం లోడుతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. టెంపో పూర్తిగా నుజ్జునుజ్జవ్వగా 14 మందీ ఘటనాస్థలిలోనే మృతిచెందారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 14 మంది మృతి

లారీడ్రైవర్‌ షేక్‌ ఫరూక్‌ బాషా స్పందించి పక్కనే ఉన్న మదార్‌పురం గ్రామస్థులను బిగ్గరగా కేకలు పెట్టి పిలిచారు. స్పందించిన కొందరు హుటాహుటిన రోడ్డుపైకి చేరుకుని ప్రాణభయంతో కేకలు పెడుతున్న నలుగురు పిల్లలు... యాస్మిన్‌, కాషిఫ్‌, ఆస్మా, షేక్‌ మూసా అసిన్‌లను కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు లక్ష చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

మృతులు వీరే...

నౌజీరా బీ (65), ఆమె పెద్ద కుమారుడు షేక్‌ దస్తగిరి (50), పెద్ద కోడలు అమ్మాజాన్‌ (35), మనువరాళ్లు సిమ్రిన్‌ (16), అమ్రిన్‌ (15), రెండో కుమారుడు షేక్‌ రఫీ (36), రెండో కోడలు మస్తానీ (32), మనవరాలు మహ్మద్‌ రిహాన్‌ (1), రఫీ అత్త అమీర్‌జాన్‌ (63), మూడో కుమారుడు షేక్‌ జాఫర్‌ వలీ (30), చిన్న కోడలు రోషిణి (29), చిన్న కుమార్తె షేక్‌ నౌజియా (34), వాహన యజమాని, డ్రైవర్‌ నజీర్‌, మెకానిక్‌ షేక్‌ షఫీ(38)

క్షతగాత్రులు...

షేక్‌ ఖాసీఫ్‌ (దస్తగిరి కుమారుడు) (14), షేక్‌ యాస్మిన్‌ (రఫీ కుమార్తె) (5), షేక్‌ ఆస్మా (జాఫర్‌ వలీ కుమార్తె) (8), మూసా అసిన్‌ (జాఫర్‌ వలీ కుమారుడు) (4)

అమ్మా నాన్నా కావాలంటూ..

ప్రమాదంలో గాయపడిన చిన్నారులను కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. మృతిచెందిన జాఫర్‌ వలీ, రోషిణిల ఎనిమిదేళ్ల ఆస్మా ‘నాకు అమ్మ-నాన్న కావాలి.. ఎక్కడున్నారు’ అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఖాసీఫ్‌, యాస్మిన్‌ షాక్‌ నుంచి చాలాసేపటి వరకు తేరుకోలేదు.

ఫాస్టాగ్‌ ఉపయోగించిన పది నిమిషాల్లోనే..

ప్రమాదస్థలికి పది కిలోమీటర్ల దూరంలో అమకతాడు టోల్‌గేట్‌ ఉంది. ఈ టోల్‌గేట్‌కి ఆదివారం తెల్లవారుజామున 3.23కు ఎంబీఎస్‌ ట్రావెల్‌ పేరుతో ఉన్న టెంపో 8వ లేన్‌కు చేరుకుంది. ఫాస్టాగ్‌ ఉపయోగించి క్షణాల్లో ముందుకు వెళ్లింది. పది కిలోమీటర్ల ముందుకు వెళ్లగానే ప్రమాదం చోటుచేసుకుంది. దీన్నిబట్టి చూస్తే తెల్లవారుజామున సుమారు 3.40 గంటల సమయంలో ఘటన జరిగినట్లు స్పష్టమవుతోంది.

వ్యాపారంలో లాభాలు వచ్చాయని..

చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండ గ్రామానికి చెందిన నౌజీరా బీ కుటుంబం కొన్నేళ్ల క్రితం మదనపల్లె వచ్చి బాలాజీనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. స్థానికంగా పాత ఇనుప సామగ్రి, పేపర్లతో తుక్కు వ్యాపారం చేస్తుంటారు. ఈ వ్యాపారంలో లాభాలు రావడంతో మొక్కు చెల్లించుకుందామని అజ్‌మేర్‌ యాత్రకు బయలుదేరారు.

రక్తంతో తడిసిన సరకులు....

మదనపల్లె నుంచి అజ్‌మేర్‌కు 1,953 కిలోమీటర్ల దూరం ఉంది. దారిలో వాహనం నిలుపుకొని వంట చేసుకునేందుకు కావాల్సిన నిత్యావసర సరకులు, సామగ్రి అంతా సిద్ధం చేసుకుని వెళుతున్నారు. ప్రమాదంలో 14 మంది మృతి చెందడం, శరీరభాగాలు ఛిద్రమవ్వడం చూపరులను గగుర్పాటుకు గురిచేసింది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన కందిపప్పు, బియ్యం వంటివి రక్తంతో తడిచిపోయాయి. టెంపో ట్రావెలర్‌ సామర్థ్యం 12 సీట్లు కాగా, నలుగురు చిన్నారులు, డ్రైవర్‌, మెకానిక్‌ కలుపుకొని 18 మందితో ప్రయాణం చేస్తున్నారు.

గుర్తింపు కష్టం

చెల్లాచెదురుగా పడిన వాహనశకలాల నడుమ మృతులను గుర్తించడానికి పోలీసులకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ఒక హ్యాండ్‌బ్యాగ్‌లో నాలుగు ఆధార్‌, ఒక ఆరోగ్యశ్రీ కార్డు లభించాయి. ఆ చిరునామాల ఆధారంగా వివరాలు సేకరించారు. వాటిలో మృతి చెందిన రోషిణి పేరుతో ఓటరు స్లిప్పు లభించింది.

అందుకే ఆ ప్రాణాలు నిలిచాయి..

ప్రమాదంలో 14 మంది మరణించినా.. నలుగురు చిన్నారులు మాత్రం మృత్యుంజయులుగా బయటపడ్డారు. వాహనం పల్టీలు కొట్టినప్పుడు సీట్లలో ఉన్నవారంతా తలకిందులైన సమయంలో అందరి మధ్యలో ఈ నలుగురు చిక్కుకుపోవడంతో గట్టిదెబ్బలు తగలకుండా రక్షణ కలిగింది. ప్రమాదం జరిగాక గ్రామస్థులు వచ్చి మృతదేహాల నడుమ ఊపిరాడని చిన్నారులను బయటకు తీసి ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు తరలించారు.

వంతెన పైనుంచి కిందకు పడేది

- షేక్‌ ఫరూక్‌ బాషా, లారీ డ్రైవరు

మేం వరంగల్‌ నుంచి తాడిపత్రికి ఇనుప ఖనిజం లోడుతో వస్తున్నాం. మదార్‌పురం వంతెన వద్దకు చేరుకోగానే టెంపో వాహనం అవతలి రోడ్డు నుంచి పల్టీలు కొడుతూ ఇవతలి రోడ్డుకు దూసుకొచ్చి మా లారీని ఢీకొట్టింది. లారీ లేకపోతే వంతెనపై నుంచి టెంపో కిందకు పడేది. వెంటనే గ్రామస్థులను పిలిచి, వాళ్ల సాయంతో నలుగురు పిల్లలను కాపాడగలిగాం.

మలుపును గమనించలేక..

ఈనాడు డిజిటల్‌, కర్నూలు, కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగంతో పాటు మలుపూ ఓ కారణమే. జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-44)పై మదార్‌పురం వద్ద ఉపరితల వంతెనపై మలుపు ఉంది. దీన్ని గమనించకపోతే నేరుగా డివైడర్‌ని తాకే ప్రమాదం ఉంది. మలుపు ముందు ఎలాంటి రేడియం సూచిక బోర్డులూ పెట్టలేదు. జాతీయ రహదారి నిబంధనల ప్రకారం రోడ్డుకు 8 అంగుళాల ఎత్తున డివైడర్‌ ఉండాలి. మదార్‌పురం వద్ద పాతరోడ్డుపై పది రోజుల కిందటే తారు పొర వేశారు. దీంతో డివైడర్ల ఎత్తు తగ్గిపోయి, దానికి తగలగానే అవతలి రోడ్డుపైకి వాహనాలు దూసుకెళ్తున్నాయి. కొన్ని రోజుల క్రితం డోన్‌ నుంచి కర్నూలు వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ మీదుగా అవతలి వైపునకు దూసుకెళ్లి నిలిచింది.

కర్నూలు ప్రమాదంపై గవర్నర్‌, సీఎం ఆవేదన...

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: కర్నూలు జిల్లా మదార్‌పురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 14 మంది యాత్రికులు మృత్యువాతపడటంపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి....

వెల్దుర్తి ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: చంద్రబాబు

రోడ్డు ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

రహదారి భద్రతపై దృష్టిసారించాలి: పవన్‌

రోడ్డు ప్రమాదం తన మనసును కలచి వేసిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. రహదారి భద్రత అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ప్రయాణికులతో కూడిన వాహనాలు నడిపే డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన, తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

* అరకు ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడం బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

Last Updated : Feb 15, 2021, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details