శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ఈనెల 16న ఆణివార ఆస్థానంను పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్‌పై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షణగా వచ్చి ఆలయ శద్ధి కార్యక్రమం నిర్వహించారు.
ఆనందనిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయంలోని ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రిని శుభ్రం చేశారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ శుద్ధి కారణంగా మధ్యాహ్నం వరకు దర్శనాలు నిలిపివేశారు. నిన్న శ్రీవారిని 19,218 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 8,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు వచ్చింది.