తిరుపతిలోని కోదండరామస్వామి వార్షిక బ్రహ్మూత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల ఐదో రోజు మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామి పల్లకిలో ఊరేగారు. మోహిని రూపంలో పల్లకిపై విహరించిన శ్రీరామచంద్రుడిని దర్శించుకుంటే ఇహలోక సౌఖ్యాల వ్యామోహం నుంచి బయటపడతారని భక్తులు విశ్వసిస్తారు.
స్వామివారి వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా సాగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. కరోనా కారణంగా వాహనసేవలు, స్నపన తిరుమంజనం కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించారు. ఉత్సవాలలో తితిదే జీయర్ స్వాములు, ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.