ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన వేరుశనగ విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ సీడ్స్ సన్నద్ధం అవుతోంది. ఇది వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో పండించిన విత్తనపు కాయలు అందుబాటులో ఉంచుతూ వచ్చారు. ఈ దఫా నాణ్యమైన వేరుశనగ విత్తనపు కాయలను చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి సిద్ధం చేశారు. నిల్వ చేసిన 45000 క్వింటాళ్ల మేర వేరుశనగ కాయలను ఈ నెల 17వ తేదీన పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కార్యాచరణ లక్ష్యం..
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో పశ్చిమ మండలాలతో పాటు తూర్పు మండలాల్లో పాక్షికంగా వేరుశనగను సాగు చేస్తుంటారు. ఈ సీజన్‌లో 1.11 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణంగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అందులోనూ ఈ సారి పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు బాగుండటంతో దాదాపు పూర్తి స్థాయిలో రైతులు సాగు చేసేందుకు వీలుంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది.
విత్తన సేకరణ పూర్తి..
సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో చుట్టుపక్కల రాష్ట్రాలైన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వివిధ రకాల వేరుశనగ విత్తనపు కాయలు తెప్పించి రైతులకు పంపిణీ చేస్తుంటారు. అయితే ఈ సారి ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్న కె-6 వేరుశనగ రకాన్ని సేకరించేందుకు ఏపీసీడ్స్ సిద్ధమైంది. 60 వేల క్వింటాళ్లు లక్ష్యం కాగా.. దాదాపు రెండు నెలల నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇప్పటి వరకు 45 వేల క్వింటాళ్ల మేర సిద్ధం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన సూచనల మేరకు కిలో విత్తనాన్ని రూ.64 వంతున కొనుగోలు చేస్తోంది. ఈ నెల 5వ తేదీ వరకు విత్తనాలు సేకరించేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలా సేకరించిన విత్తనపు కాయలను విత్తనశుద్ధి కేంద్రాలైన పీలేరు, నాగలాపురం, నిమ్మనపల్లికి తరలించి శుద్ధి చేయించే ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం జిల్లాలోని ఆయా ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా వేరుశనగ విత్తనపు కాయలను గిడ్డంగుల్లో నిల్వ చేసింది.