కలియుగ ప్రత్యక్షదైవం..శ్రీనివాసుని సన్నిధిలో కార్తిక వనభోజన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కోలాహలంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయం నుంచి గజ వాహనంపై శ్రీవారు, మరో పల్లకీలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పాపవినాశనం రహదారిలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. మంగళ వాద్యాలు, మహిళల కోలాటాలు, భజన బృందాల నృత్యాల మధ్య స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కన్నులపండువగా సాగింది.
సుందరంగా అలంకరించిన పార్వేట మండపంలో శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనంను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మద్య పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, సుగంధద్రవ్యాలతో ఉత్సవరులకు అభిషేకం చేశారు. ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. అన్నమయ్య కళాకారులచే భక్తి సంకీర్తనా కచేరీని నిర్వహించారు.