ఖాతాదారులు బ్యాంకులో దాచుకున్న సొమ్మును సిబ్బంది నొక్కేశారు. సేవింగ్ , ఫిక్స్డ్ డిపాజిట్లలోని సొమ్మును ఖాతాదారులకు తెలియకుండా డ్రా చేసి పంచుకున్నారు. అకౌంట్ లావాదేవీలను ఖాతాదారుల ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లకుండా బ్లాక్ చేశారు. 'నెట్వర్క్ పనిచేయలేదు. ప్రింటర్లు పని చేయలేదు' అంటూ పాస్ పుస్తకాలు ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో జరిగిన మోసాలను ఖాతాదారులు గుర్తించలేకపోయారు. ఓ వెలుగు స్వయం సహాయక సంఘాల గ్రూపునకు ఇవ్వని రూ.10 లక్షల రుణాన్ని ఇచ్చినట్లు చెప్పడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
BANK SCAM: కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆ రెండు కోట్లు ఏమయ్యాయి..?
12:15 August 26
రూ.2 కోట్లు స్వాహా అయినట్లు బాధితుల ఆందోళన
అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతాల్లోని నగదు రూ.2 కోట్లు మాయం చేశారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు రహస్యంగా విచారణ చేపట్టారు. మాయమైన నగదును త్వరలో ఖాతాలలో జమ చేస్తామని బ్యాంకు అధికారులు వారం రోజులుగా బుజ్జగిస్తున్నారు. అయితే వారి నమ్మకం కోల్పోయిన వెలుగు సంఘాల గ్రూపు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రూపు సభ్యులు పొదుపు ఖాతాలో దాచుకున్న నగదును సైతం బ్యాంకు సిబ్బంది ఫోర్జరీ సంతకాలతో కాజేసి పంచుకున్నారు. ఫోన్ నెంబర్లకు మెసేజ్‌లు వెళ్లకుండా బ్లాక్ చేశారు. బ్యాంకు పుస్తకాల్లో లావాదేవీలను చూపకుండా ప్రింటర్ పని చేయడం లేదంటూ ఏడాదిగా బుకాయిస్తూ వస్తున్నారు.
దీంతో ఖాతాదారులు తమ ఖాతాల్లో నగదు నిల్వలు ఉన్నవో లేవో గుర్తించలేకపోతున్నారు. కలికిరి మండలం మజ్జిగ వాండ్లపల్లికి చెందిన గణేష్ స్వయం సహాయక సంఘం సభ్యులు తమకు రుణం కావాలని బ్యాంకు అధికారులు కోరగా ఇటీవలే మీ సంఘానికి రూ.10 లక్షల రుణం ఇచ్చినట్లు తెలపడంతో సభ్యులు అవాక్కయ్యారు. ఈ రుణాన్ని తాము తీసుకోలేదని ఎవరు కాజేశారని సంఘ సభ్యులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు. కలికిరి పట్టణానికి చెందిన గుల్జార్ బేగం.. ఫిక్స్డ్ డిపాజిట్లు రూ .8 లక్షలు స్వాహా చేశారు. బాండ్లు ఆమె దగ్గర ఉండగానే సెల్ఫ్‌గా నగదు డ్రా చేసుకున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా బ్యాంకు సిబ్బంది చేతివాటంతో పలువురు ఖాతాల నుంచి రూ.2 కోట్ల వరకు నగదు స్వాహా చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: Covid: పాఠశాలల్లో కరోనా కలకలం..వైరస్ బారిన విద్యార్థులు, ఉపాధ్యాయులు