వైకాపా నాయకులు తనపై దాడికి పాల్పడ్డారని చిత్తూరు జిల్లా బి.కొత్త కోటకు చెందిన జూనియర్ సివిల్ జడ్జ్ రామకృష్ణ ఆరోపణలు చేశారు. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. మంగళవారం బి. కొత్తకోటలో నిర్మాణంలో ఉన్న తన ఇంటి పైకి కొంతమంది వైకాపా నాయకులు వచ్చి.. దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వైకాపా నాయకుల ఫొటోలను... ఓ వీడియోను న్యాయమూర్తి రామకృష్ణ సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఎమ్మెల్యే.. దళితుడైన తనపై కావాలనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఓ న్యాయమూర్తినై ఉండి... తనకే న్యాయం జరగకపోతే ఎలా అని ప్రశ్నించారు. గతంలో రాయచోటిలో జూనియర్ సివిల్ జడ్జిగా రామకృష్ణ పనిచేశారు. అయితే ఇటీవలి కాలంలో స్థానిక వైకాపా నాయకుల నుంచి ఇంటి నిర్మాణం విషయంలో ఒత్తిడి వస్తోందన్న ఆయన... తాజాగా వైకాపా నాయకులు పాల్పడిన దాడిలో.. తన భుజానికి తీవ్ర గాయమైందని తెలిపారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.