jawan saiteja Journey in army: ఆర్మీ వాహన డ్రైవర్ నుంచి సీడీఏస్ భద్రత సిబ్బంది స్థాయికి - తెలుగు వార్తలు
jawan saiteja Journey in army: బాల్యం నుంచే సైన్యంలో చేరాలన్నది అతని ఆశయం.. అహోరాత్రులు శ్రమించి కలలు గన్న ఆశయాన్ని చేరుకున్నారు.. ఆర్మీలో తొలుత డ్రైవర్‌గా చేరి.. కఠినమైన వడపోత తర్వాత పారా కమాండో అయ్యారు. అదే క్రమంలో త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రత సిబ్బంది స్థాయికి ఎదిగాడు చిత్తూరు జిల్లా ఎగువరేగడ బిడ్డ సాయితేజ.
jawan saiteja
By
Published : Dec 9, 2021, 10:17 AM IST
jawan saiteja Journey in army :తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌నాయక్ సాయితేజ అమరుడైయ్యాడు . కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన రైతు మోహన్, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు సాయితేజ (29), చిన్న కుమారుడు మహేష్ బాబు (27). సైన్యంలో చేరి.. దేశసేవ చేస్తానని బాల్యం నుంచే సాయితేజ కుటుంబసభ్యులు, బంధువులకు చెప్పేవారు. తిరుపతి ఎంఆర్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, మదనపల్లెలో ఇంటర్ పూర్తి చేశారు. మదనపల్లెలో డిగ్రీలో చేరి రెండు నెలలు సెలవు పెట్టి గుంటూరులో ఆర్మీకి సన్నద్ధమయ్యారు. కొన్నినెలలకే సైన్యంలో సిపాయిగా అవకాశం వచ్చింది.
మార్చిలో వస్తానని..
రెండు వారాల కిందట స్నేహితుడి మరణం.. వినాయకచవితికి సాయితేజ ఇంటికి వచ్చారు. వచ్చే మార్చిలో మరోసారి వచ్చి నెలరోజులకుపైగానే స్నేహితులతో గడుపుతానని చెప్పారు. రెండు వారాల కిందట తన బ్యాచ్‌లోని స్నేహితుడు మరణించడంతో తన బాధను మిత్రులతో పంచుకున్నారు. బుధవారం ఉదయం రెండుసార్లు ఫోన్ చేశారు. సాయంత్రం మరోసారి మాట్లాడతానన్నారు. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైందని తెలిసిన తర్వాత.. కుటుంబసభ్యులు ఫోన్ చేయగా ఎటువంటి స్పందన లేదు. సాయంత్రం సైన్యం నుంచి సాయితేజ మరణ సమాచారం వచ్చింది. దీంతో శ్యామల, మోక్షజ్ఞ, దర్శిని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత.. గురువారం సాయంత్రం తర్వాత లేదా శుక్రవారం ఉదయం పార్థివదేహం జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి తన బృందంతో కలిసి అక్కడకు వెళ్లి.. వారికి ధైర్యం చెప్పారు. అయిదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరాల్సిన వ్యక్తి.. మూడున్నర గంటల కిందట మాట్లాడిన వ్యక్తి మృతదేహాన్ని తాము చూడాల్సి వస్తుందని అనుకోలేదని శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు సాయితేజ తల్లిదండ్రులకూ గ్రామంలోని వ్యక్తులు చెప్పేంతవరకూ.. కుమారుడి మరణ వార్త తెలియలేదు. సాయితేజకు ఏమీ కాలేదని.. వస్తాడని వారికి చెప్పారు. కోడలు, కుటుంబసభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో వారు విషాదంలో మునిగిపోయారు.
ఇదే రకం హెలికాప్టర్‌లో గతంలో జిల్లావాసి మృతి.. ఎనిమిదేళ్ల కిందట పూతలపట్టు మండలం చిన్నబండపల్లికి చెందిన వినాయకన్ ఇదే తరహా హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మరణించారు. ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించడంతో.. ఎన్డీఆర్‌ఎఫ్ దళ సభ్యుడిగా ఉన్న వినాయకన్ సహాయక చర్యలకు వెళ్లారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2013లో హెలికాప్టర్ కుప్పకూలడంతో 20 మంది మరణించగా.. అందులో వినాయకన్ ఉన్నారు.