ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భరతమాత ముద్దుబిడ్డకు వీడ్కోలు.. అశ్రునయనాల నడుమ సాయితేజ అంత్యక్రియలు - అంత్యక్రియలు

Jawan-sai-teja: హెలికాప్టర్​ ప్రమాదంలో మృతిచెందిన జవాన్​ సాయి తేజ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన సొంత ఊరు ఎగువ రేగడ గ్రామంలో అంతిమ వీడ్కోలు పలికారు. గాల్లోకి కాల్పులు జరిపి.. సైన్యం గౌరవ వందనం సమర్పించింది. జనం భారీగా తరలివచ్చారు. సాయితేజ అమర్​ రహే అంటూ నినదించారు.

జవాన్​ సాయి తేజ
జవాన్​ సాయి తేజ

By

Published : Dec 12, 2021, 3:03 PM IST

Updated : Dec 13, 2021, 3:56 AM IST

Jawan-sai-teja: హెలికాప్టర్​ ప్రమాదంలో మృతిచెందిన జవాన్​ సాయితేజ అంత్య క్రియలు ముగిశాయి. చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం.. ఎగువ రేగడ గ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భరతమాత ముద్దుబిడ్డను కడసారి కళ్లారా వీక్షించేందుకు.. జనం భారీగా తరలివచ్చారు. సాయితేజ అమర్​ రహే అంటూ నినదించారు.

భరతమాత ముద్దుబిడ్డకు వీడ్కోలు

ఆదివారం ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు ముగుస్తాయని జిల్లా యంత్రాంగం ప్రకటించినా.. విద్యార్థులు, బంధువులు, స్నేహితులు, ప్రజలు భారీగా తరలిరావడంతో మధ్యాహ్నం 3.20 సమయంలో అంత్యక్రియలు ముగించారు. ఆదివారం ఉదయం ఐదు గంటలకు బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రి నుంచి సాయితేజ మృతదేహాన్ని అంబులెన్సులో స్వస్థలానికి తరలించారు. కర్ణాటక సరిహద్దు నంగిలి చెక్‌పోస్టు మీదుగా పలమనేరు, పుంగనూరు బైపాస్‌కు వాహనాన్ని మళ్లించారు.

ఎగువరేగడలో సైనికుల గౌరవ వందనం

మదనపల్లె పట్టణ శివారు వలసపల్లెకు ఉదయం 9 గంటలకు అంబులెన్సు చేరుకున్న తర్వాత ర్యాలీగా సాయితేజ స్వగ్రామానికి బయలుదేరారు. యువత త్రివర్ణ పతాకం చేతబూని దారిపొడవునా ‘భారత్‌ మాతాకీ జై’, ‘సాయితేజ అమర్‌ రహే’ అంటూ నినదించారు. సమీప గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి.. గంటల కొద్దీ నిరీక్షించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భౌతికకాయం ఎగువరేగడకు చేరింది. సాయితేజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు ఇంట్లో కొంతసేపు ఉంచారు. పార్థివ దేహాన్ని చూడగానే ఆయన భార్య శ్యామల సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం స్థానిక మైదానంలోకి తీసుకొచ్చారు. అక్కడ సాయితేజ తండ్రి మోహన్‌ గుండెలవిసేలా రోదించారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పోలీసుశాఖ తరఫున చిత్తూరు, తిరుపతి అర్బన్‌ ఎస్పీలు సెంథిల్‌ కుమార్‌, వెంకట అప్పలనాయుడు, జిల్లా యంత్రాంగం నుంచి జేసీ (గృహ నిర్మాణం) వెంకటేశ్వర్‌తో పాటు 11వ పారా బృందం, 35 ఎన్‌సీసీ ఆంధ్రా బెటాలియన్‌ చిత్తూరు బృందం నివాళులర్పించారు. సైనిక లాంఛనాలు పూర్తిచేసిన తర్వాత సాయితేజ ఇంటి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు చేశారు.

బెంగళూరు నుంచి భౌతికకాయం

లాన్స్‌నాయక్‌ సాయితేజ భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి కర్నల్‌ శేఖర్‌ అత్రి నేతృత్వంలో చిత్తూరు జిల్లా ఎగువరేగడికి ఆదివారం వేకువజామున తరలించారు. రాష్ట్ర సరిహద్దుకు అంబులెన్సు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి స్థానికులు, బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

భరతమాతకు సేవ చేయాలని..
బాల్యం నుంచే సైన్యంలో చేరాలన్నది అతని ఆశయం.. అహోరాత్రులు శ్రమించి కలలు గన్న ఆశయాన్ని చేరుకున్నారు. ఆర్మీలో తొలుత డ్రైవర్‌గా చేరి.. కఠినమైన వడపోత తర్వాత పారా కమాండో అయ్యారు. అదే క్రమంలో త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రత సిబ్బంది స్థాయికి ఎదిగాడు. అలాంటి చిత్తూరు జిల్లా ఎగువరేగడ బిడ్డ సాయితేజ.. తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడయ్యాడు .

కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన రైతు మోహన్‌, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు సాయితేజ (29), చిన్న కుమారుడు మహేష్‌ బాబు (27). సైన్యంలో చేరి.. దేశసేవ చేస్తానని బాల్యం నుంచే సాయితేజ కుటుంబసభ్యులు, బంధువులకు చెప్పేవారు. తిరుపతి ఎంఆర్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, మదనపల్లెలో ఇంటర్‌ పూర్తి చేశారు. మదనపల్లెలో డిగ్రీలో చేరి రెండు నెలలు సెలవు పెట్టి గుంటూరులో ఆర్మీకి సన్నద్ధమయ్యారు. కొన్నినెలలకే సైన్యంలో సిపాయిగా అవకాశం వచ్చింది.

మార్చిలో వస్తానని..
వినాయకచవితికి సాయితేజ ఇంటికి వచ్చారు. వచ్చే మార్చిలో మరోసారి వచ్చి నెలరోజులకుపైగానే స్నేహితులతో గడుపుతానని చెప్పారు. రెండు వారాల కిందట తన బ్యాచ్‌లోని స్నేహితుడు మరణించడంతో తన బాధను మిత్రులతో పంచుకున్నారు. బుధవారం ఉదయం రెండుసార్లు ఫోన్‌ చేశారు. సాయంత్రం మరోసారి మాట్లాడతానన్నారు. బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అదృశ్యమైందని తెలిసిన తర్వాత.. కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా ఎటువంటి స్పందనా లేదు. సాయంత్రం సైన్యం నుంచి సాయితేజ మరణ సమాచారం వచ్చింది. గంటల కిందట మాట్లాడిన వ్యక్తి మృతదేహాన్ని తాము చూడాల్సి వస్తుందని అనుకోలేదని బంధువులు, మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి:Tamil Nadu chopper crash: స్వగ్రామానికి జవాన్ల పార్థివదేహాలు- భారీగా జనం హాజరు

Last Updated : Dec 13, 2021, 3:56 AM IST

ABOUT THE AUTHOR

...view details