చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం చిన్నపోడుజేను గ్రామంలో జల్లికట్టును గ్రామస్థులు (నేడు) ఆదివారం కోలాహలంగా నిర్వహించారు. ప్రతి ఏడాది సంక్రాంతిలో భోగి పండుగ రోజున జల్లికట్టు నిర్వహించే గ్రామస్థులు ఈ ఏడాది అనివార్య కారణాలతో వాయిదా వేశారు. సంప్రదాయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో జల్లికట్టుపై పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ.. పశువుల పండుగను నిర్వహించడానికి గ్రామస్థులు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. గ్రామాన్ని ముందురోజు నుంచే రంగు కాగితాలతో అలంకరించి ముస్తాబు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి జల్లికట్టులో బరిలో దించడానికి పశువులను గ్రామానికి తరలించి సిద్ధం చేశారు. జల్లికట్టును తిలకించడానికి వచ్చిన అశేష జనవాహినితో పల్లె కిటకిటలాడింది.
బరిలో నిలిచిన యువత సంసిద్ధత వ్యక్తం చేయడంతో నిర్వాహకులు పశువులను జనసమూహం వైపు తప్పెట్ల దరువు మధ్య విడతలవారీగా వదిలిపెట్టారు. వేగంగా దూసుకొస్తున్న పశువులను నిలువరించడానికి యువత పడ్డ పాట్లు చూపరులకు ఆసక్తిని రేకెత్తించాయి. పశువుల కిందపడి గాయాలపాలైనా లెక్కచేయక యువత మళ్లీమళ్లీ పశువులను నిలువరించడానికి విఫలయత్నం చేశారు. జల్లికట్టుకు హాజరైన అశేష జనవాహినికి గ్రామస్థులు భోజన వసతి ఏర్పాటు చేశారు. జల్లికట్టుకు తిలకించడానికి సుమారు ఐదు వేల మంది జనాభా హాజరైనట్లు అంచనా వేశారు.