Jagan Promises to Kuppam: మడమ తిప్పడు మాటతప్పడు.. ఇది సీఎం జగన్ గురించి ఆయన పార్టీ నేతలు గొప్పగా చెబుతున్న మాట. కానీ ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలకే.. దిక్కుమొక్కులేకుండా పోతోంది. కుప్పం నాదీ.. పులివెందులలానే భావిస్తానని బీరాలుపలికి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు కానీ.. పనులు మాత్రం చేయించలేకపోతున్నారు. 6 నెలలుగా పనులు జరక్క.. మురుగు కాలువల కోసం తీసిన గోతుల్లో పడి స్థానికులు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
2022 సెప్టెంబరు 23న సీఎం జగన్ కుప్పంలో పర్యటించినప్పుడు ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. కుప్పంను పులివెందుల లానే భావిస్తానని ప్రకటించిన ఆయన.. ఈ మున్సిపాల్టీలో 66కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కుప్పం గ్రామీణ పరిధిలోని ప్రాంతాలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ముఖ్యమంత్రే పనులు ప్రారంభించడంతో.. నిధులు వచ్చేస్తాయని వైసీపీ నేతలు, గుత్తేదారులు అప్పులు తెచ్చి మరీ పనులు చేశారు. 16వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులకు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే నిలిపేశారు.
కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 25 వార్డుల్లో.. 35 పనులకు ప్రతిపాదించారు. మురుగు కాలువలు, సీసీ రోడ్లు, సామాజిక భవనాల నిర్మాణం, పార్కుల అభివృద్ధి పనులు చేపట్టారు. 16 వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణం ప్రారంభించారు. NTRకాలనీ, చీగలపల్లె, షికారీ కాలనీ, జయప్రకాష్ రోడ్డు, మోడల్ కాలనీ ప్రాంతాలలో పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.