చిత్తూరు జిల్లా పీలేరులో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా సభ్యులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి 30 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అందులో 15 అధిక ధర కలిగిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, కర్ణాటకల్లోని పలు జిల్లాల్లో చోరీ చేసిన ఈ వాహనాల మొత్తం విలువ సుమారు రూ.45లక్షల వరకు ఉంటుందన్నారు.
పోలీసుల దర్యాప్తులో...
ఇటీవల పీలేరు పట్టణానికి చెందిన వ్యక్తి బుల్లెట్ బైక్ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు చేపట్టగా.. మదనపల్లి మార్గంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరించగా.. తమతో పాటు మరో ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వారి నుంచి బైక్ల దొంగతనానికి వినియోగించిన స్క్రూడ్రైవర్, డూప్లికేట్ తాళాలు, ఫ్లగ్ వైరు స్వాధీనం చేసుకున్నారు.