చిత్తూరు జిల్లాలో 65 ప్రభుత్వ, 166 ప్రైవేటు జూనియర్ కళాశాలలు అధికారికంగా ఉన్నాయి. అనధికారికంగా మరో 30 కళాశాలలు నడుస్తున్నట్లు సమాచారం. కానీ ఇంటర్ ప్రవేశాల కోసం వెబ్‌సైట్‌లో ప్రభుత్వ కళాశాలలు అన్నింటిని అనుమతించగా.. తొలి రోజు 32 ప్రైవేటు కళాశాలల్ని మాత్రమే అనుమతించారు. రెండో రోజైన గురువారం మరో 50 ప్రైవేటు కళాశాలలను ప్రవేశాలకు అనుమతిస్తూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇలా రోజుకో జాబితా విడుదల చేయడంతో ఆంతర్యమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు తేదీ ఈనెల 29 వరకు ఎదురుచూస్తేగాని కళాశాలలపై స్పష్టత వచ్చే అవకాశంలేదని తెలుస్తోంది.
దాగుడుమూతలు ఎందుకు..?
ఇంటర్ ప్రవేశాల నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఆగస్టులో ఆరు బృందాలను (ఒక్కో బృందానికి ముగ్గురు సభ్యులు) జిల్లాకు పంపింది. ప్రతి కళాశాల భవనం, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, అగ్నిమాపక అనుమతులు, పారిశుద్ధ్య నిర్వహణ సౌకర్యాలు, తాగునీరు తదితర 25 రకాల వసతులను బృందాలు పరిశీలించి జియో ట్యాగింగ్ చేసింది. ఈ బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని సౌకర్యాలు ఉన్న 32 ప్రైవేటు కళాశాలలను తొలుత ప్రవేశాలకు అనుమతించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీటిలో 50 శాతం కనీస సౌకర్యాలు లేని కళాశాలలే అని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, పలుకుబడి ఉన్న మరిన్ని కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతిస్తూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సమాచారం. ప్రస్తుతం అనుమతించిన కళాశాలల్లో కొన్నింటిని పరిశీలిస్తే వాటిలో చిరునామా లేని, కనీసం పార్కింగ్ సౌకర్యం, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేని కళాశాలలు చూసి విద్యావేత్తలు విస్తుపోవాల్సి వచ్చింది.
స్పష్టత కోసం ఎదురుచూపులు