టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో అక్కడి పంట నష్టపోవడమే ఇక్కడ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. మహారాష్ట్రలో టమాటా ఎక్కువ సాగయ్యే నాసిక్, కొల్హాపుర్ జిల్లాల్లోనూ సెప్టెంబరులో గులాబ్ తుపానుతో పంట పాడైంది. పెట్రోలు, డీజిల్‌ల ధరల పెరుగుదలతోనూ రవాణా ఛార్జీలు అధికమయ్యాయి. వీటన్నింటి ప్రభావంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చిత్తూరు జిల్లాలోని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 80 వేల నుంచి లక్ష ఎకరాల్లో టమాటా సాగవుతోంది. ఇక్కడ కర్రను ఆధారంగా చేసుకొని ఎక్కువగా పండిస్తుండటంతో ఏటా సుమారు 14-15 లక్షల టన్నుల నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. వీటిని విజయవాడ, ఉత్తరాంధ్రతోపాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లకు ఎగుమతి చేస్తుంటారు. అనంతపురం జిల్లాలో 30 వేల ఎకరాల్లో టమాటా సాగున్నా... అక్కడ నేలపై పండిస్తున్నందున నాణ్యత కొంత తక్కువగా ఉండటంతో పెద్దగా ఎగుమతులు చేసే అవకాశం లేదు. శుక్రవారం మదనపల్లె మార్కెట్‌కు 397 టన్నులు రాగా.. మొదటి గ్రేడ్ గరిష్ఠంగా కిలో రూ.30, కనిష్ఠ ధర రూ.19, రెండో గ్రేడ్ గరిష్ఠంగా కిలో రూ.18.60, కనిష్ఠంగా రూ.7 పలికింది.