ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూర్తి కాని స్థల సేకరణ.. ఆగిన ఆలయ అభివృద్ధి పనులు! - శ్రీకాళహస్తీశ్వరాలయం తాజా వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయం రాహు, కేతు సర్ప దోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి. దీంతో రెండు దశాబ్దాలుగా భక్తుల రద్దీతో పాటు ఆలయ ఆదాయం పెరిగింది. ఏటా రూ.100 కోట్లకుపైగా ఆలయానికి ఆదాయం వస్తోంది. అందుకు తగ్గట్టుగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అప్పటి తెదేపా ప్రభుత్వం 2017లో ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ స్థల సేకరణ సమస్యగా మారి ప్రణాళిక అమలు నాలుగేళ్లుగా ముందుకు కదలటం లేదు.

Incomplete land acquisition for Srikalahasti temple development
పూర్తికాని స్థల సేకరణ

By

Published : Jul 3, 2021, 4:54 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో బృహత్తర ప్రణాళిక అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న సన్నిధి వీధి, దిగువ సన్నిధి వీధి, రాజగోపురం పరిసర ప్రాంతాలతో పాటు గోపురం నుంచి రంగుల గోపురం లోపు 3.9 ఎకరాల స్థలాన్ని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఉన్న దుకాణాలు, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు ఇప్పటికే ఖాళీ చేయించారు. 199 మంది నిర్వాసితులకు రూ.99 కోట్లు పరిహారం ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ఏడుగురు మినహాయించి మిగిలిన వాళ్లందరూ.. స్థలాలు, దుకాణ భవనాలు అప్పగించారు. మిగిలిన ఏడుగురు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..న్యాయస్థానం వారిలో ఆరుగురికి పరిహారం ఇప్పించింది.

అయితే ఇప్పటివరకు వారి నుంచి భవనాలను స్వాధీనం చేసుకోకపోవటంపై విమర్శలు తలెత్తుతున్నాయి. భూ సేకరణ పూర్తయితే తప్ప అభివృద్ధికి అడుగులు పడే అవకాశం కనిపించటం లేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మరో నిర్వాసితుడికి పరిహారం ఇవ్వాల్సి ఉంది. బృహత్తర ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేయాల్సిన పనులకు సంబంధించి దేవాదాయ శాఖ రెండు విడతలుగా నిధులిచ్చేందుకు అంగీకారం తెలిపింది. తొలుత రూ.86.01 కోట్లతో 11 పనులు, రెండో విడతగా రూ.56.39 కోట్లతో 8 రకాల పనులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. ముఖ్యంగా మహా ప్రకారం, రాహుకేతు పూజలకు వచ్చే భక్తులు నిరీక్షించే భవనాలు, వాణిజ్య సముదాయం, క్యూలైన్లు, స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాలు సుందరీకరణ వంటి పనులు చేపట్టనున్నారు.

నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం పంపిణీ ఓ కొలిక్కి రానున్నదని ఆలయ ఈవో పెద్దరాజు తెలిపారు. పరిహారం అందని మరో బాధితుడితో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వారు అంగీకరిస్తే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

AMARAVATI: ఎమ్మెల్యే శ్రీదేవికి నిరసన సెగ.. రాజీనామా చేయాలని రైతుల డిమాండ్

ABOUT THE AUTHOR

...view details