చిత్తూరు జిల్లాలోని ఐదు సబ్-డివిజన్‌లలో పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలతో డీఎస్పీలు స్వయంగా తనిఖీలు చేస్తున్నారు. విధులకు వెళ్లే వారికి మొదట వైరస్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ వచ్చారు. ఇలా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన మార్గాలు, ప్రధాన కూడళ్లను దిగ్బంధం చేసి ఎవరూ అనవసరంగా తిరగకుండా చేశారు.కర్ఫ్యూ సమయంలో ప్రజల కదలికలను కట్టడి చేశారు.
భారీ ఎత్తున జరిమానాలు
చిత్తూరు పోలీసు జిల్లాలోని ఐదు సబ్-డివిజన్‌లలో పోలీసులు ఏడాది వ్యవధిలో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించి భారీ ఎత్తున జరిమానాలు విధించారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 8.48 లక్షల కేసులు నమోదు చేసి, సుమారు రూ.9.65 కోట్లు జరిమానా విధించారు. అందులోనూ మాస్కులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 5,07,215 కేసులు నమోదు చేసి జరిమానా కింద రూ.7,37,47,940 వసూలు చేశారు. మాస్కుల కేసుల్లో మదనపల్లె, పలమనేరు సబ్-డివిజన్ పోలీసులు అధిక మొత్తంలో కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి వాహనాల్లో తిరుగుతున్న వారు, దుకాణాలను తెరచి ఉంచిన వారు, భౌతిక దూరం పాటించని వారు, ఇలా మరి కొన్ని ఉల్లంఘనలపై 3,41,730 కేసులు నమోదు చేసి, రూ.2,27,84,850 జరిమానా వసూలు చేశారు. ఇందులోనూ మదనపల్లె, పలమనేరు సబ్-డివిజన్ పోలీసులే అధికంగా కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు.