చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ...రోజుకు వేల సంఖ్యలో ట్రాక్టర్లతో బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్వర్ణముఖి నదిలో సుమారు పది మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు.
వ్యవసాయ బోర్లు ఎండిపోవడంతో పొలాలను బీడు భూములుగా మార్చుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని..నిబంధనల మేరకే తవ్వకాలు చేపట్టాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు.