ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగని ఇసుక దందా.. కేసులు పెట్టినా బేఖాతర్ - చిత్తూరులో ఇసుక వ్యాపారం న్యూస్

నిబంధనలు వారికి వర్తించవు.. కేసులు నమోదు చేస్తున్నా భయపడరు.. ఇసుక రవాణాలో అక్రమార్కుల తీరు ఇది. డిమాండ్​ ఆధారంగా అధికంగా డబ్బను వసూలు చేస్తున్నారు.

sand illegal transport
అక్రమంగా ఇసుక రవాణా

By

Published : Aug 31, 2020, 2:27 PM IST

ఇసుక.. అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా తమ పంథాలోనే పోతున్నారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఇటీవల పలు కారణాలతో కొన్ని రీచ్‌లను నిలిపేశారు. గతంలో పూతలపట్టు మండలంలో రెండు రీచ్‌లుండగా.. అక్రమాలు జరుగుతుండటంతో మూసేశారు. గంగాధరనెల్లూరు మండలంలో కూడా 4 రీచ్‌లకుగాను ప్రస్తుతం ఒక్కచోట ఇసుక లభ్యమవుతోంది. కుప్పం, మదనపల్లెలోని ఇళ్ల నిర్మాణదారులకు ఇసుక కావాలంటే ఇతర నియోజకవర్గాల నుంచి బుక్‌ చేసుకోవాల్సిందే. దీనికితోడు రవాణా చేసిన వ్యక్తి.. అదనంగా నగదు డిమాండ్‌ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది.

పాతబోలు పంచాయతీలోనే కాదు.. జిల్లాలో పదికి పైగా మండలాలలో ఇసుక డంపింగ్‌లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. సరిహద్దు మండలాలలో డంపింగ్‌ ఎక్కువగా జరుగుతోంది. ఈనెల 9న మదనపల్లె గ్రామీణ మండలం పొతబోలు పంచాయతీ పరిధిలో అధికారులు స్వాధీనం చేసుకున్న 40 టాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లెకు సమీపంలో పెద్దపంజాణి మండలం శంకరాయలపేట, కలికిరి మండలం మేడికుర్తిలోనే రీచ్‌లు ఉన్నాయి. కొందరు స్థానికంగా ఉన్న చెరువులు, వాగులు, వంకల నుంచి ఇసుక తీస్తున్నారు. అనంతరం వాటిని మారుమూల ప్రాంతాల్లో, ఇళ్ల మధ్య డంప్‌ చేస్తున్నారు. ఇసుక అవసరమైన వారితో ముందుగానే మాట్లాడుకొని.. రాత్రిళ్లు తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుక రూ.4వేలు- రూ.5వేలు విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది.

  • అవసరాలను అవకాశాలుగా మార్చుకొని..

ఇసుక కోసం కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టినా.. సకాలంలో రావడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి వారి అవసరాలను కొందరు అవకాశాలుగా మార్చుకుంటున్నారు. సమీపంలోని నదులు, వాగులు, వంకల నుంచి భారీగా ఇసుక తీస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా శివారు ప్రాంతాలతోపాటు ఇళ్ల మధ్య కూడా నిల్వ చేస్తున్నారు. ఈ పరిస్థితి మదనపల్లె, రామసముద్రం, పాలసముద్రం, చిత్తూరు గ్రామీణ, పుంగనూరు, పలమనేరు, గంగవరం మండలాల్లో ఎక్కువగా ఉంది. సత్యవేడు మండలంలో మామిడి చెట్లలో ఇసుక దాచి ఉంచగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • ప్రభుత్వ నిర్మాణాలకు నాణ్యత లేని ఇసుక

నిల్వ చేసిన ఇసుకను రాత్రిళ్లు వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. డిమాండ్‌, నాణ్యతను బట్టి వారి నుంచి రూ.4వేలు- రూ.6వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడటంతోపాటు ప్రకృతి వనరులకు నష్టం జరుగుతోంది. వాగులు, వంకల్లో ఇసుక తీయడం వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం సైతం తగ్గే పరిస్థితి ఉంది. ఏర్పేడు మండలంలోని మడిబాక, పాపానాయుడుపేట రీచ్‌ల్లో ఒకసారి ఆన్‌లైన్‌లో జారీ అయిన బిల్లుతో.. ఆ రోజులో ఎక్కువసార్లు ఇసుక తీసుకుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలసముద్రం మండలంలో స్థానిక వంకలు, వాగుల్లో తీసిన నాణ్యత లేని ఇసుకను ‘నాడు- నేడు’ పనులతోపాటు సచివాలయ భవనాల నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. రీచ్‌లు దూరంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా తీసే ఇసుకనే నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. తమిళనాడులో ఇసుకకు భారీగా డిమాండ్‌ ఉండటంతో ఈ ప్రాంతం నుంచి రాత్రిళ్లు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచడంతోపాటు డంప్‌లపై భారీగా దాడులు చేస్తే.. అక్రమార్కులు దారిలోకి వచ్చే అవకాశం ఉంది.

  • 230 వాహనాలు స్వాధీనం

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, డంపింగ్‌ చేయడంపై కేసులు పెట్టడంతోపాటు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటివరకు 180కి పైగా కేసులు నమోదు చేసి.. 230 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

కేసులు నమోదు చేస్తాం

ఇసుకను డంప్‌ చేయడానికి ఎటువంటి అనుమతులు లేవు. డంపింగ్‌ చేసిన వ్యక్తులపై గతంలో కూడా కేసులు నమోదుచేశాం. వాహనాలు సీజ్‌ చేశాం. స్థానికావసరాల కోసం పంచాయతీ కార్యదర్శి లేదా సచివాలయంలోని సంబంధిత సిబ్బంది అనుమతి తీసుకొని ఇసుక తీసుకోవచ్ఛు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. - రిశాంత్‌రెడ్డి, ఏఎస్పీ ఎస్‌ఈబీ

ఇదీ చదవండి:మదిలో నీవు.. నిద్రకేది తావు?

ABOUT THE AUTHOR

...view details