Igloo Theater: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నిర్మించిన ఇగ్లూ సినిమా థియేటర్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తోంది. మంచు ప్రాంతాల్లో ఎస్కిమోలు నిర్మించుకొనే ఇళ్ల తరహాలో కేవలం అర ఎకరంలో ఈ బుల్లితెర థియేటర్‌ను నిర్మించారు. ఈ ప్రాంతానికి చెందిన వారు సినిమా చూడాలంటే 40కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ లేదా జగిత్యాలకు వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ఓ భారీ థియేటర్ నిర్మించేందుకు కొందరు ప్రయత్నాలు చేసినా.. ఆ స్థాయిలో ప్రేక్షకులు వస్తారా అన్న సందేహంతో వెనక్కి తగ్గారు.
ఈ నేపథ్యంలోనే తక్కువ సీట్ల సామర్ద్యంతో ఇగ్లూ థియేటర్ నిర్మించారు. 100 సీట్ల సామర్ధ్యం.. 42అడుగుల వృత్తం విస్తీర్ణంలో రోజుకు 5షోలు ప్రదర్శించే విధంగా ఈ ఇగ్లూ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఇగ్లూ థియేటర్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. దక్షిణాదిలో ఇలాంటి థియేటర్లు ఉన్నా.. రాష్ట్రంలో ఖమ్మం ప్రాంతంలో మాత్రం ఇలాంటి తరహాలో థియేటర్ కొనసాగుతోంది.
ఈ ప్రయత్నం సరికొత్తగా ఉంది:రాజారాంపల్లిలో ఏర్పాటైన ఈ థియేటర్.. ధర్మపురి, ధర్మారం, వెల్గటూరు మండలాల ప్రజలకు వినోదాన్ని పంచనుంది. గ్రామీణ ప్రజల కోసం చేసిన ఈ ప్రయత్నం సరికొత్తగా ఉందని మంత్రి కొప్పుల కితాబిచ్చారు. ముంబయిలోని ఛోటు మహారాజ్ ఫ్రాంచైస్ ఒప్పందం మేరకు ఇక్కడ నిర్మాణం చేపట్టారు. నలుగురు భాగస్వాములు.. ప్రజలను ఆకర్షించే విధంగా నిర్మించిన ఈ థియేటర్‌లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు తరలివస్తున్నారు.