వ్యవసాయం.... దేశ ప్రాధ్యామాల్లో తొలిస్థానం కలిగి ఉంది. 50 శాతానికి పైగా దేశప్రజలకు ప్రధాన జీవన వనరు ఇదే. దేశ జీడీపీలో 18 శాతం వ్యవసాయానిదే అంటే ఆ ఆవశ్యకత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో భారతీయుల జీవితాల్లో ఓ సంస్కృతిలా అంతర్భాగమైంది వ్యవసాయం. పరుగులు పెడుతున్న ప్రపంచంతో సరిసమానంగా వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను... దేశీయ రైతాంగం అందిపుచ్చుకోవటంలో వెనుకబడిందన్నది కఠిన వాస్తవం. ఫలితంగా... రైతన్న ఎంత శ్రమించినా సరైన ఫలితాలు రాబట్టలేక దిగాలు పడుతున్నాడు.
ఆ ఒక్క చోటే కోర్సులు
సమస్య మూలాలను పసిగట్టి... వాటిని ప్రక్షాళన చేయాల్సిన ప్రభుత్వాలు రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా భావిస్తున్నాయే తప్ప సమగ్ర పరిష్కరాలు చూపలేకపోతున్నాయి. భావిపౌరులను తీర్చిదిద్దుతున్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రపంచంతో పోటీ పడాలనే కాంక్షతో వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నాయి. ప్రముఖ విజ్ఞాన సంస్థలైన 23 ఐఐటీలలో కేవలం ఒక్క ఐఐటీ ఖరగ్పూర్లో మాత్రమే వ్యవసాయ సంబంధిత ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయంటే ఈ రంగంపై ప్రభుత్వాలు చూపుతున్న ఉదాసీనత అర్థం చేసుకోవచ్చు.
సరికొత్త విధానంలో సాగు
వ్యవసాయ రంగ ఆధునిక పద్ధతులు భావి తరాలకు చేరువ చేసేందుకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నడుం బిగించింది. విశ్వవిద్యాలయంలోని వృక్ష శాస్త్ర విభాగంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు ఎందరో విద్యార్థులకు మార్గదర్శకాలు అందిస్తోంది. అత్యాధునిక సాగు పద్ధతుల్లో ఒకటైన హైడ్రోపోనిక్స్ ద్వారా సరికొత్త పద్ధతిలో మొక్కలను పెంచటంపై విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలను అందిస్తూ...ఓ విన్నూత్న ప్రయోగానికి నాంది పలికింది.
పురుగు మందులు లేకుండా పంట
హైడ్రోపోనిక్స్.. భూమి అవసరం లేకుండా కేవలం నీటి ద్వారా మొక్కలను పెంచే ఆధునిక సాగు ప్రక్రియ. సాధారణ సాగులో ఖర్చయ్యే నీటి శాతంలో సగం కంటే తక్కువ నీటితోనే ఈ సాగు చేయవచ్చు. 21వ శతాబ్దంలో అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతికతతో .. నీటి ద్వారా మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తూ ఎరువులు, పురుగు మందులు అవసరం లేకుండా సాగుచేయవచ్చు.
విద్యార్థి టూ రైతు
ఈ విధానంపై దేశంలో గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. దేశవాళీ పంటలు, మిద్దె తోటలు, ఇంటికి అవసరమైన కూరగాయల పెంపకంలో హైడ్రోపోనిక్స్ విరివిగా ఉపయోగించుకోవచ్చని పరిశోధనల్లో వెల్లడయ్యాయి. క్షేత్రస్థాయిలో సాధారణ పంటలకంటే అతి తక్కువ మొత్తంలో నీటిని వినియోగించటం ద్వారా సాగు సాధ్యమయ్యే ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటాన్ని బాధ్యతగా చేపట్టింది తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం. వర్సిటీలో విద్యార్థి దశ నుంచే ఈ విధానంపై శిక్షణ, అవగాహన కల్పించటం ద్వారా భవిష్యత్లో విభిన్న సాగు విధానాల ద్వారా వ్యవసాయ రంగాన్ని తిరిగి పురోభివృద్ధి పథంలో నడిపించాలనే కృత నిశ్చయంతో ప్రణాళికలు రచించింది.
నైపుణ్య పాఠ్యాంశాలు