చిత్తూరు నగర శివారులోని పెనుమూరు క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ కారు, లారీని ఆపి తనిఖీలు చేపట్టగా... నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 182 ఎర్ర చందనం దుంగలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
వీరిలో ఒకరిపై గతంలో కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 12 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఇంకా కొంత మంది స్మగ్లరు ఉన్నట్లు గుర్తించామని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ సెంథిల్ కుమార్ నగదు రివార్డులు అందించారు.