నివర్ తుపాను సృష్టించిన కల్లోలం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ధాటికి చేతికొచ్చిన పంటంతా నీటిపాలైంది. పైరు నేలకొరిగింది. గార్గేయనదితో పాటు వాగుల ప్రవాహ ఉద్ధృతికి వ్యవసాయ బావులు, మోటార్లు, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. తుపాను తెరిపి ఇచ్చి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చాలాచోట్ల పొలాలు నీటిలోనే దర్శనమిస్తున్నాయి. అప్పో సొప్పో చేసి పెట్టుబడులు పెట్టిన సన్న, చిన్నకారు రైతన్నలు గుండెలవిసేలా రోదిస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి.
రైతు ఆశలపై నీళ్లు
చిత్తూరు జిల్లాలో రైతులు 40 వేల 555 ఎకరాల్లో వరి పంట వేయగా ఒక్క పుంగనూరు నియోజకవర్గంలోనే 6 వేల 868 ఎకరాల్లో సాగు చేశారు. మరో 14 వందల 47 ఎకరాల్లో చెరకు, మామిడి, టమాటా వంటి వాణిజ్య పంటలు వేశారు. ఫలితాలూ ఆశాజనకంగానే కనిపించాయి. రేపో, మాపో పంట చేతికందుతుందనే సమయానికి... వారి ఆశలకు తుపాను గండికొట్టింది.