అమర్ రాజా పరిశ్రమలో పీసీబీ అధికారులు, ఐఐటీ మద్రాస్ నిపుణులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీ నివేదికను న్యాయస్థానం ముందు ఉంచాలని కాలుష్య నియంత్రణ మండలిని హైకోర్టు ఆదేశించింది. పరిశ్రమలోని ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతంపై పరీక్షలు చేసేందుకు పీసీబీ అధికారులకు సహకరించాలని అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ యాజమాన్యానికి స్పష్టం చేసింది. పరిశ్రమలోని ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పీసీబీ మూసివేత ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఆరు వారాలకు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ కె.సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమర్ రాజా బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగుల గోపినాథ్ రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపారు. పరిశ్రమలో పీసీబీ అధికారులు, మద్రాస్ ఐఐటీ నిపుణులు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారని పీసీబీ తరఫు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి అన్నారు. తనిఖీల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కంపెనీలోని 1800 మంది ఉద్యోగులకు రక్త పరీక్షలు చేయాలని పీసీబీ నిర్ణయించిందన్నారు. అందుకు పరిశ్రమ యాజమాన్యం సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రక్త పరీక్షలు నిర్వహిస్తుంది: అమర్ రాజా బ్యాటరీస్ తరపు సీనియర్ న్యాయవాది
లెడ్ ప్రభావానికి గురైన కొద్దిమంది ఉద్యోగులను లెడ్ రహిత ప్రాంతానికి తరలించి వైద్యం అందిస్తున్నామని అమర్ రాజా బ్యాటరీస్ తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటుందని.. పీసీబీ ఇప్పటికే పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం లేదన్నారు. కోర్టు విచారణ పరిధిలోని అంశాల పీసీబీ మెంబర్ సెక్రెటరీ మీడియా ముందు ప్రస్తావించారని.. అలాంటివి పునరావృతం కాకుండా నియంత్రించాలని చెప్పుకొచ్చారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. కోర్టులో విచారణ పెండింగ్ ఉన్నందున పరిశ్రమకు సంబంధించిన విషయాలను మీడియాతో మాట్లాడకుండా నియంత్రణ పాటించేలా పీసీబీ అధికారులకు సూచన చేయాలని పీసీబీ తరఫు న్యాయవాదికి సీవీ మోహన్ రెడ్డికి సూచించింది.