ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంధ్రా ఊటీ... తాగునీరు లేక అల్లాడుతోంది' - రాయలసీమ

కలియుగ వైకుంఠనాథుడు కొలువైన పవిత్రమైన ప్రాంతం... చిత్తూరు జిల్లా దాహార్తితో అల్లాడుతోంది. ఎన్నడూ లేని విధంగా... నీటి ఎద్దడి జిల్లావ్యాప్తంగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో 10 రోజులకు ఓసారి తాగునీరు సరఫరా అవుతోంది. హంద్రీనీవా రాకతో... సాగునీటికి లోటుండదనీ... ఇక సస్యశ్యామలమేనని భావించినా... ఎగువ నుంచి నీరు రాని కారణంగా కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. బోర్లు భోరుముంటున్నాయి.

ఆంధ్రా ఊటీ... తాగునీరు లేక అల్లాడుతోంది

By

Published : May 17, 2019, 9:03 AM IST

ఆంధ్రా ఊటీ... తాగునీరు లేక అల్లాడుతోంది

రాయలసీమలో కొంత సస్యశామంగా కనిపించే చిత్తూరు జిల్లా... తాగునీరు లేక అల్లాడుతోంది. సుమారు 42 లక్షల జనాభా నివసిస్తున్న ఈ జిల్లాలో.. చాలా ప్రాంతాల్లో 10 రోజులకోసారి నీరు రావడం కలవరపెడుతోంది. జిల్లా తాగునీటి అవసరాలు తీర్చే తెలుగుగంగ కాలువ, కైలాసగిరి రిజర్వాయర్, కల్యాణి జలాశయం, మదనపల్లె సమీపంలోని చిప్పిలి జలాశయం, పెనుమూరు సమీపంలోని ఎన్టీఆర్ జలాశయాల్లో నీటిస్థాయి పడిపోయింది. ఏటా మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు మండలాల్లో మాత్రమే కరవు ఛాయలు కనిపించేవి. ఈ సారి శ్రీకాళహస్తి, సత్యవేడు, జీడీ నెల్లూరు మండలాల ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరుపతి నగరంలో సుమారు 4లక్షల మంది నివసిస్తుండగా... మరో లక్ష మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. నీరు సరఫరా చేయాల్సిన నగరపాలక సంస్థ... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరైన నీటి నిల్వలు లేక... నాలుగు రోజులకోసారి నల్లాల ద్వారా నీరందిస్తున్నారు. శివారు ప్రాంతాలైన ఎమ్మార్ పల్లె, సరస్వతి నగర్, శ్రీ కృష్ణనగర్​ వాసులకు 15రోజులకోసారి అందించడమూ కష్టంగా మారంది. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా... ఏ మాత్రం సరిపోవడంలేదని ప్రజలు చెబుతున్నారు.

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 2వేల 677 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2వేల 308 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. 367 గ్రామాలకు వ్యవసాయ బోర్లు అనుసంధానం చేసి దాహార్తి తీర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని జిల్లా పాలనాధికారి పీఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు.

కడప జిల్లా గండికోట రిజర్వాయర్ నుంచి పైపులైన్ల ద్వారా 2వేల 600 కోట్ల నిధులతో నీళ్లు రప్పించే ప్రయత్నాలు తుదిదశకు చేరాయి. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి...

ఎన్నికల నిబంధనలను ఈసీయే ఉల్లంఘిస్తోంది: బాబు

ABOUT THE AUTHOR

...view details