అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. పొంగిపొర్లతున్న వాగులు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి పడుతున్న వాన కారణంగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు, అండర్ బ్రిడ్జిలు వర్షపు నీటితో నిండిపోయాయి. మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జిల్లో నీరు చేరడంతో ట్రాఫిక్ స్థంభించింది. కేవీఆర్ పెట్రోల్ బంక్, గాంధీ బొమ్మ, ట్రంకురోడ్డు, సుబేదారుపేట, సండే మార్కెట్, కాంప్లెక్స్ రోడ్లు వరద నీటితో కాలువలను తలిపించాయి. రహదారులు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గంలోని కే వి పురం మండలంలో వరదనీటి ప్రవాహానికి కాళంగి- శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై కాజ్ వే కోతకు గురైంది. ఆధారం, కాళంగి, హనుమయ్య కండ్రిగ, కండ్లులూరు, రంగయ్య గుంట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కెవిబిపురం మండలం కాళంగి రిజర్వాయర్‌కు పదివేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లును అడుగు మేర ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. వరద ప్రవాహం అధికమయితే మరింత ఎక్కువ నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు నగరంలోని తల్పగిరి కాలనీ, బాలాజీ నగర్ ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లల్లో చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని బుజబుజ నెల్లూరు, చంద్రబాబు నగర్ ప్రాంతాలలో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పారుతున్నాయి. నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లోని గ్రామాల మీదుగా కొనసాగే చావాలి వాగు ఉధృతంగా పారుతోంది.
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలో ఓ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తనకల్లు మండలం నాయనచెరువుపల్లికి రెండు రోజులుగా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా కందుకూరు చెరువు పారుతోంది. దీనికితోడు చెన్నరాయస్వామిగుడి జలాశయంలోకి ఇన్ఫ్లో పెరుగుతుండడంతో గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ప్రవాహం తగ్గేవరకు 50 కుటుంబాలు జలదిగ్భంధంలో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామానికి మరో మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తమ గ్రామానికి వెళ్లే మార్గంలోనే వంతెన ఎత్తు పెంచి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాకాలంలో తరచూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:amaravati padayatra : పోటెత్తుతున్న అమరావతి ఉద్యమం.. పోలీసు హెచ్చరికలతో అలజడి!