నివర్ తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల వాహనరాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చంద్రగిరి మండలంలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దోర్నా కంబాలలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోగా...స్థానికులు అతడిని కాపాడారు.
స్వర్ణముఖి, భీమా నదుల్లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కూచివారిపల్లిలో ఎస్సీ కాలనీ, వైకుంఠం ఎస్టీ కాలనీ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. శ్రీవారి మెట్టు మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కళ్యాణి డ్యామ్‌లోకి వరద వచ్చి చేరటంతో 10 అడుగుల మేర నీరు చేరింది. మరో 25 అడుగుల మేర నీరు చేరితే కళ్యాణి డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.