చేతుల్లో అధికారం ఉంది.. చెప్పినట్టు వినే అధికారులున్నారు.. ఇంకేముంది ఎటువంటి అనుమతులు లేకుండానే క్వారీల నుంచి విలువైన గ్రానైట్‌ను వెలికి తీస్తున్నారు. పచ్చటి కొండలను రోజురోజుకు కరిగించేస్తున్నారు.. కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) పైప్‌లైన్ సమీపంలో ఉండటంతో క్వారీలో పేలుళ్లలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. కానీ అక్రమార్కులు ఓ ప్రజాప్రతినిధి అండతో తవ్వకాలు జరుపుతుండటంతో అధికారులు ఈ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. - ఇదీ బంగారుపాళ్యం మండలం కల్లూరిపల్లె రెవెన్యూలోని సర్వే నంబరు 1లో ఏడు నెలలుగా జరుగుతున్న అక్రమతవ్వకాల వ్యవహారం.
ప్రస్తుతం అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో విలువైన బ్లాక్ గ్రానైట్ ఉంది. దీనికి ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.3,450 సీనరేజీగా ప్రభుత్వం నిర్ణయించింది. కుప్పం, మదనపల్లె, చిత్తూరులో లభించే గ్రానైట్ ఒక క్యూబిక్ మీటర్ ధర రూ.1,925గా ఉంది. దీంతో ఈ ప్రదేశంపై అక్రమార్కుల కన్ను పడింది. గతంలో కొందరు దరఖాస్తు చేసుకున్నా.. ఐఓసీఎల్ పైప్‌లైన్ పక్కనే ఉన్నందున అనుమతులు ఇవ్వలేమని అధికారులు మౌఖికంగా చెప్పారు. దీంతో సదరు వ్యక్తులు దరఖాస్తును ఉపసంహరించుకున్నారు.
నెలకు రూ.75 లక్షలు వసూళ్లు
ఇంతటి కీలకమైన ఈ గ్రానైట్ క్వారీపై పూతలపట్టు నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి కన్ను పడింది. రెవెన్యూ, గనుల శాఖల అధికారులకు ఎటువంటి దరఖాస్తు చేసుకోకుండానే.. కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతమున్న క్వారీ పక్కనే.. ఓ రైతు మామిడి తోపు ఉంది. ఆ సన్నకారు రైతుకు.. కొంత డబ్బు చెల్లించారని తెలుస్తోంది. కొంతకాలం తర్వాత బోరు వేయిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. తదనంతరం అక్రమంగా చేజిక్కించుకున్న క్వారీలో కొంతభాగాన్ని బంగారుపాళ్యం మండలంలోని ఓ నాయకుడికి అప్పగించారు. ఆయన్నుంచి రోజుకు రూ.లక్ష వసూలు చేస్తున్నారని సమాచారం. మరికొంత భాగాన్ని చిత్తూరు నగరానికి చెందిన ఒకరికి ఇచ్చారు. ఇందుకుగాను రోజుకు రూ.1.50 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆ ప్రజాప్రతినిధి నెలకు రూ.75 లక్షలు సంపాదిస్తున్నారు. ఇలా ఏడు నెలలుగా సుమారు రూ.5.25 కోట్లు గడించారు. నెలకు రూ.45 లక్షలు ఇస్తున్న వ్యక్తి.. ఇటీవల తాను అంత ఇవ్వలేనని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వానికి మాత్రం డెడ్‌రెంట్, సీనరేజీ తదితర ఫీజుల రూపేణా ఒక్క రూపాయి కూడా చేరలేదు.