ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవిందా.. ఇంకా దొంగ  దొరక్కపాయె - chori

గోవిందరాజస్వామి ఆలయంలో స్వర్ణ కిరీటాలు చోరీ జరిగి 25 రోజులు కావొస్తున్నా నిందితుల ఆచూకీ, పోయిన సొత్తు జాడ దొరకటం లేదు. దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం

By

Published : Feb 25, 2019, 5:06 AM IST

కోరిన కోర్కెలు తీర్చే చల్లని దేవుడు.. తిరుపతి గోవిందరాజస్వామి. ఆయన ఆలయంలో కిరీటాల మాయం కలకలం సృష్టించింది. స్వర్ణ కిరీటాలు కనిపించకుండా పోయి 25 రోజులు కావస్తున్నా.. చోరీకి కారణమైన నిందితులను పట్టుకోలేకపోవటం విమర్శలకు తావిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యేక బృందాల సాయంతో నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ కేసులో పురోగతి లేకపోవటం.. దర్యాప్తు నీరు గారుతుందేమోనన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.

శ్రీగోవిందరాజస్వామి ఆలయం


ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి తిరుపతిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తిరుమల శ్రీవారికి అన్నగారిగా పూజలందుకునే గోవిందరాజస్వామి ఆలయంలో స్వర్ణ కిరీటాలు మాయమయ్యాయన్న వార్త నగరమంతా వ్యాపించింది.రాత్రికి రాత్రే, తితిదే విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి అర్బన్ పోలీసులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. క్లూస్ టీం, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అసలు నిందితుడ్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఆరు ప్రత్యేక బృందాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల ఛాయా చిత్రాలు మరుసటి రోజే విడుదల చేశారు. ఈ చర్య.. నిందితుడ్ని త్వరలో పట్టుకుంటారనే ధీమాకు దారితీసింది.

ఒకానొక సమయంలో ఆలయంలో సీసీ కెమెరాలు అన్నీ సరిగా పనిచేస్తున్నాయా? అనే అనుమానం తలెత్తింది. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. అతి త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామన్నారు.

పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి.. తిరుపతి సహా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఉత్తరాది రాష్ట్రాల్లోని అనుమానిత ప్రాంతాలన్ని చోట్లా విచారణ ప్రారంభించారు. చైన్నైలో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారని ఓసారి.. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడ్ని పోలిన వ్యక్తి ఆనవాళ్లు గుర్తించారని మరోసారి.. సమాచారం బయటకు రావటం తప్ప పురోగతి ఏమీ లేదు.

నిందితుడ్ని పట్టుకోవటంలో వస్తున్న అడ్డంకులేంటనే విషయం మాత్రం పోలీసులు బయటకు రానివ్వటం లేదు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయంలో స్వర్ణ కిరీటాలు మాయం కావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఎవరి పాత్ర ఉంది? మాయమైన సమయంలో ఆభరణాలకు బాధ్యత వహించాల్సిన అర్చకులు, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్టు? విచారణ ఎంతవరకు వచ్చిందనే సమాచారం పోలీసులు ఎందుకు బయటపెట్టటం లేదంటూ.. శ్రీ వారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details