Discounts Cheating : ప్రముఖ బహుళజాతి సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే శ్రీధర్ భారీ డిస్కౌంట్‌కు ఆశపడి ఆన్‌లైన్లో ఖరీదైన ఫోన్‌కు ఆర్డర్ చేశాడు. ముందుగా డబ్బు చెల్లించిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పడంతో క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లింపులు జరిపాడు. ఎన్నిరోజులయినా ఫోన్ రాలేదు. ఫిర్యాదు చేద్దామని సదరు వెబ్‌సైట్లో ఉన్న టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేశాడు. ‘పొరపాటు జరిగింది, స్టాక్ అయిపోయింది. అందువల్ల ఫోన్ పంపలేకపోతున్నాం.
బ్యాంకు ఖాతా వివరాలు చెబితే డబ్బు వెనక్కి వేస్తాం’ అని సమాధానం వచ్చింది. వారి మాటలు నమ్మి బ్యాంకు ఖాతా వివరాలే కాదు ఓటీపీ కూడా చెప్పాడు. డబ్బు వెనక్కి రాకపోగా ఖాతా మొత్తం ఖాళీ అయింది. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసింది ఓ నకిలీ సంస్థ అని తెలిసింది. డిస్కౌంటుకు ఆశపడి తొలుత డబ్బు పోగొట్టుకోగా..దాన్ని రాబట్టుకునే తొందరలో ఇంకాస్త నష్టపోయాడు. ఇది ఒక్క శ్రీధర్ సమస్య మాత్రమే కాదు. అనేక మంది ఇలాగే సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు.
పెరిగిన ఆన్‌లైన్ సంస్కృతే ఆయుధం:ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ మామూలయ్యింది. పల్లెలకూ విస్తరించింది. ఆహారపదార్థాలు, కిరాణా వస్తువులు, దుస్తులు, ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఒకటేమిటి ఆన్‌లైన్లో అందుబాటులో ఉండనివి లేవంటే అతిశయోక్తికాదు. పెరుగుతున్న ఈ ఆన్‌లైన్ షాపింగ్ సంస్కృతిని సైబర్ కేటుగాళ్లు ఆయుధంగా వాడుకుంటున్నారు. రకరకాల పద్ధతుల్లో దోచుకుంటున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
డిస్కౌంట్ల పేరిట వల:తక్కువ ధరకు వస్తుందంటే ఎవరికైనా ఆశపుడుతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు ఖరీదైన ఫోన్‌ను సగం ధరకే ఇస్తున్నామని ఆన్‌లైన్లో ప్రకటన ఇస్తున్నారు. ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఏదైనా సమాచారం చూస్తున్నప్పుడు ఇలాంటి పాపప్‌లు కనిపిస్తాయి. ఆశపడి క్లిక్ చేస్తే అది కాస్తా ఏదో వెబ్‌సైట్లోకి తీసుకెళ్తుంది. దాన్ని తెరవగానే భారీ ఆఫర్లు కనిపిస్తాయి.
తమవద్ద స్టాక్ మిగిలిపోయిందని, దాన్ని త్వరితగతిన వదిలించుకునేందుకే క్లియరెన్స్ సేల్ పెట్టామని, అందుకే తక్కువ ధరకు అమ్ముతున్నామని నమ్మబలుకుతారు. ఖాతాదారుడి నంబరు తీసుకొని కాల్‌సెంటర్ నుంచి ఫోన్ కూడా చేస్తారు. ఫోన్ కొనేవరకూ వదలిపెట్టరు. ముందుగా నగదు చెల్లించేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని షరతు పెడతారు. తక్కువ ధరకు ఫోన్ వస్తుందన్న తొందరలో నెట్‌బ్యాంకింగ్ ద్వారానో, క్రెడిట్‌కార్డు ద్వారానో డబ్బు చెల్లించేలా చేస్తారు. ఒక్కసారి ఇలా డబ్బు చెల్లిస్తే ఇక ఇంతే సంగతులు. బ్యాంకు ఖాతా వివరాలన్నీ నేరగాళ్లకు చిక్కినట్లే. వీటి ఆధారంగా ఖాతా ఖాళీ చేస్తారు.
క్యాష్‌బ్యాక్ పేరిట డబ్బు ఖాళీ:వాలెట్ ద్వారా జరిపిన లావాదేవీలకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభించిందని ఫోన్ నంబరుకు లింక్ వస్తుంది. దాన్ని తెరవగానే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. డబ్బు మీ ఖాతాలో జమ అవుతుందని పైకి చెబుతున్నా వాస్తవానికి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బు కొల్లగొడతారన్నమాట.