Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ 38వ రోజు యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం చింతపర్తిలో జరిగింది. ఈ పాదయాత్రలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మహిళా దినోత్సవం సందర్బంగా.. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖి పూర్తెన అనంతరం పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లి మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత అశోక్ తన కుటుంబసభ్యులతో కలిసి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పాదయాత్ర చేసే సమయంలో ప్రమాదబారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నానని.. వైఎస్సార్సీపీ నేతలు వచ్చి ఎలాంటి సహాయం అందించలేదని లోకేష్‌కు వివరించారు. పీలేరు టీడీపీ నేత కిషోర్ కుమార్ రెడ్డి సహకారంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తమ సమస్య తీసుకెళ్లామని వివరించారు. మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయన 30 లక్షల రూపాయలు విడుదల చేయడంతో మెరుగైన వైద్యం పొంది తన ప్రాణాలు దక్కించుకున్నానని వివరించారు. కృతజ్ఞతాభావంతో మీ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నాను అని అన్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి బ్యానర్ కట్టే సమయంలో సర్పంచ్ ప్రమాదానికి గురయ్యారు. కాని మన ప్రభుత్వం 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు అని అన్నారు. రాజకీయాల్లో అంతా కుటుంబ సభ్యులుగా ఉండాలి.. మూడు నెలలు మాత్రమే రాజకీయం చేయాలి తరువాత అందరూ కుటంబ సభ్యులుగా ఉండాలి.. కాని జగన్ దానికి విరుద్దంగా సమాజాన్ని కులం, మతం, ప్రాంతం, అని ముక్కలు ముక్కలుగా చీల్చేశారు అని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఏదో మూల ఏదో ఒక రకంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి అని ధ్వజమెత్తారు. మన ప్రభుత్వం అధికారంలో ఉంటే కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ఆపదలో ఎవరున్నా సరే వారికి వెంటనే సంక్షేమాన్ని అమలు చేస్తామని అన్నారు.. జగన్ గొప్పలు చెప్పుకోవడం తప్ప అమలు చేయరని.. టీడీపీ ప్రభుత్వం మాటలు చెప్పడం కాకుండా.. అన్ని పనులు చేసి వాటిని అమలు చేస్తుందనడానికి అశోక్ ఘటన ఉదాహరణ అని తెలిపారు.