నదీ ప్రవాహం నుంచి రక్షణ కోసం ఓ కుటుంబం ఎదురు చూస్తున్న ఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో కలకలం రేపింది. ఆకులవారిపల్లె సమీపంలో పింఛ నది ఒడ్డున ఓ పేద కుటుంబం నివసించే గుడిసె కొట్టుకుపోయింది. అదే సమయంలో నది ఉద్ధృతి కూడా తీవ్రరూపం దాల్చడం వల్ల.. బాధితులు మరోవైపు వెళ్లే వీలు లేకుండాపోయింది. ఆరుగురు కుటుంబసభ్యులు సాయం కోసం ఎదురుచూస్తుండగా.. చుట్టుపక్కల వారిలోనూ ఆ దృశ్యాలు ఆందోళన రేపాయి. స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వరదల్లో చిక్కుకున్న ప్రజలు..సాయం కోసం ఎదురుచూపు - చిత్తూరు జిల్లాలో వరదలో చిక్కుకున్న ప్రజలు
భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా అతలాకుతలమవుతోంది. వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్న పలు కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి. సహాయక సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఏర్పేడు మండలంలోని సదాశివపురం ఎస్టీ కాలనీలోనూ ఇదేతరహా ఘటన చోటు చేసుకుంది. వరద నీటి మధ్యలో ఇద్దరు చిన్నారులు సహా.. చిక్కుకున్న నలుగురు సభ్యుల కుటుంబం సాయం కోసం విలవిల్లాడింది. సమీప కాలనీకి చెందిన బాలయ్య, ఇంద్ర సమీపంలోని మామిడితోటలో కాపలాదారులుగా పని చేస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా అటవీ ప్రాంతంలోని కోన కాలువ నుంచి వరద ముంచెత్తగా తోట నుంచి బయటకు రాలేక మధ్యలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రక్షణ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి:దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు