Couple death: అనుమానాస్పద స్థితిలో జవాను దంపతులు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పీలేరులో జరిగింది. గ్యాస్ బండ పేలిందని, విద్యుదాఘాతం జరిగిందని స్థానికులు చెబుతుండటంతో పోలీసులు సంబంధిత అధికారులను పిలిపించి పరిశీలన చేయించగా.. ఈ తరహా ప్రమాదం కాదని తేలింది. పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుదాఘాతమా? ఇతర కారణాలతో ప్రమాదం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు.
ఎర్రావారిపాళెం మండలం కోటకాడపల్లెకు చెందిన నాగేశ్వర్ నాయక్ (45) సీఆర్పీఎఫ్ జవానుగా జమ్ముకశ్మీర్ సెక్టార్‌లో పని చేస్తున్నారు. ఆయనకు భార్య సిద్దేశ్వరమ్మ అలియాస్ పెద్దసిద్దులు(36), కుమార్తెలు అంజలి, శ్రీచైతన్య, కుమారుడు విష్ణువర్ధన్ ఉన్నారు. పీలేరు సైనిక్‌నగర్‌లో ఇల్లు కొనుగోలు చేసి భార్యను ఇంటి వద్ద ఉంచి పిల్లలను చదివిస్తున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఇటీవల ఆయన సెలవుపై పీలేరు వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అల్లుకుని టీవీ పేలడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో పిల్లలు ఇంట్లో లేరు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే నాగేశ్వర్‌నాయక్ మృతి చెందగా.. తీవ్రగాయాలతో ఉన్న సిద్దేశ్వరమ్మను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పీలేరు అదనపు జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనివాస్ ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.