లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత తొలిసారిగా తిరుమలకు సాధారణ భక్తులు తరలివచ్చారు. స్థానికులు, తితిదే ఉద్యోగులతో 3 రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించిన దర్శనాల్లో లోటుపాట్లను గుర్తించిన అధికారులు వాటిని సరిదిద్ది గురువారం నుంచి సాధారణ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వేకువజామున శ్రీవారికి సుప్రభాతం ఇతర సేవలను ఏకాంతంగా నిర్వహించి కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఆరున్నర గంటల నుంచి భక్తులను దర్శరనానికి అనుమతించారు. తొలుత అరగంట పాటు 53 మంది ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు విరామ సమయ దర్శనం కల్పించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతించారు. 7 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఉచిత టైంస్లాట్ టోకెన్లు ఉన్న యాత్రికులను దర్శనానికి అనుమతించారు. గంటకు ఐదు వందల మంది చొప్పున రోజుకు దాదాపు ఏడు వేల మందికి దర్శనం కల్పిస్తున్న తితిదే ఆన్‌లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీచేసింది. వీటితో పాటు తిరుపతిలో అందజేసిన 3వేల750 సర్వ దర్శన టికెట్లు పొందిన వారూ స్వామిని దర్శించుకొన్నారు. తితిదే ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసిన భక్తులు సుదీర్ఘ విరామం అనంతరం స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొన్నామంటూ పరవశించిపోయారు