ఆలయాలలో ఘనంగా పూజలు...వైభవంగా ఉత్సవాలు....
విశాఖ జిల్లా...
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో గజేంద్రమోక్ష ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవం చాలా ప్రధానమైనది. ప్రతిఏటా కనుమ పండుగ రోజున స్వామివారు మెట్ల మార్గం ద్వారా పూలతోటలో ఉత్సవ నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి విశేష పూజలు చేశారు. అనంతరం సాయంకాలం సమయాన అప్పన్న మెట్ల మార్గం ద్వారా స్వామివారిని పల్లకిలో తీసుకొని వచ్చి పూల తోటలో గోవిందరాజు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ గజేంద్రమోక్ష ఉత్సవం మొసలి బారి నుంచి గజేంద్రుని రక్షించే దృశ్యాన్ని బొమ్మల ద్వారా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి స్వామి దర్శనాలు నిలుపుదల చేశారు.
చిత్తూరు జిల్లా..
కనుమ పండుగ సందర్భంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం ఆరిమాకులపల్లె గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూజకు సిద్ధం చేశారు. భక్తులు డప్పు వాయిద్యాలు బాణసంచా పేలుళ్ల మధ్య ప్రదర్శనగా చేరుకుని అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి ఆలయం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారి పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రకాశం జిల్లా...
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండలోని భవనాశి చెరువులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ప్రదక్షిణల అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను భవనాశి చెరువు వద్ద ప్రత్యేక పూజలు, కూష్మాండబలిహరణ చేశారు. హంస వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాశి చెరువు వద్ద ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. తెప్పోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చెరువులో రెండు ప్రత్యేక పడవలను గజ ఈతగాళ్లు ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లా ....
కుమ్మరి కుంటలో....
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కుమ్మరికుంట పుష్కరిణిలో సాయిబాబా తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బాబా ఆలయంలో పాట కచేరి అలరించింది.
గూడూరులో..
గూడూరులోని కోనేటి మిట్టలో వెలసిన్న శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి కోనేరులో ధనుర్మాసం సందర్భంగా ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీ కనుమూరు హరిచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరాములవారికి అగ్నిహోమం, పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యుడు వెలగపల్లి వరప్రసాద్ రావు , మాజీ శాసనసభ్యుడు పాశం సునీల్ కుమార్, శ్రీ కనుమూరి హరిచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరు హరిచంద్ర రెడ్డి, రవిచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
కర్నూలు జిల్లా...
కర్నూలు జిల్లా అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పల్లకిలో కొలువైన జ్వాల నరసింహ మూర్తి, ప్రహ్లాదుడికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి 40 రోజుల పాటు పల్లకిలో కొలువై ఆళ్లగడ్డ పరిధిలోని 36 గ్రామాలలో తిరగనున్నారు. ఈ యాత్రలో స్వామియే స్వయంగా తన భక్తుల వద్దకు వెళ్లి తన కల్యాణోత్సవానికి ఆహ్వానాన్ని అందించనున్నారు. ఇలాంటి వృత్తాంతం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అహోబిలంలో ఉండటం విశేషం. ఈ 40 రోజుల పాటు స్వామి తాను వెళ్లిన గ్రామంలో భక్తులచే విశేష పూజలు అందుకుంటారు. అహోబిల లక్ష్మీ నరసింహ స్వామిని... చెంచులు తమ బావగా భావిస్తారు. అందుకే స్వామి రాక పురస్కరించుకొని చెంచులు పల్లకి ముందు నృత్యాలు చేస్తూ విల్లుతో బాణాల సంధిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి స్వామి పల్లకి మోశారు.